
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
80 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం
మాచర్ల రూరల్: పట్టణంలో నగల దుకాణ యజమాని ఇంటి గ్రిల్స్ తాళం పగులకొట్టి, లోపలకి వెళ్లి బీరువా పగులకొట్టి లాకర్‌లోని 80 గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన సంఘటన మంగళవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని 17వ వార్డు సాయిబాబా గుడి దగ్గరలో నివసిస్తున్న వుస్తేపల్లి రామలింగేశ్వరరావు (రాంబాబు) అనే అతను రామాటాకీస్ లైన్‌లో జ్యూయలరీ షాపు నిర్వహిస్తుంటాడు. ఉదయమే ఇంటికి తాళం వేసి భార్య ధనలక్ష్మితో కలిసి షాపునకు వెళ్ళి, తిరిగి రాత్రి 9.30సమయంలో ఇంటికి వస్తుంటారు. ఇదే క్రమంలో మంగళవారం షాపునకు వెళ్ళిన వారు తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి గ్రిల్స్ తాళం పగలకొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో లాకర్‌ను పగలకొట్టి అందులో వున్న 80 గ్రాముల విలువైన బంగారపు కమ్మలు, ఉంగరాలు, చైన్, నక్లెస్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. బుధవారం రాత్రి పట్టణ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహులు పేర్కొన్నారు.