
గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు
సుమారు 300 గ్రాముల గంజాయి స్వాధీనం
మంగళగిరి టౌన్: మంగళగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం రావడంతో గురువారం ‘ఈగల్’ టీమ్ పట్టణ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు ఈగల్‌టీమ్ గురువారం మధ్యాహ్నం ఆ యువకులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 200 నుంచి 300 గ్రాముల వరకు గంజాయిని, గంజాయిని వినియోగించే త్రైస్ అనే పేరు కలిగిన రోల్స్‌ను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుల్ని విచారించగా మంగళగిరిలో ఓ యువకుడి వద్ద కొన్నామని, అతని వద్ద సుమారు 4 కిలోల వరకు గంజాయి ఉందనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు జైలు
బాపట్ల: గంజాయి కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష, పదివేలు జరిమానా విధిస్తూ గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఏ.ఎల్ సత్యవతి గురువారం తీర్పు చెప్పారు. బాపట్ల జిల్లా చందోలు పోలీసుస్టేషన్ పరిధిలోని రసూల్‌పేటకు చెందిన షేక్ నజీర్‌బాషా నివాసంలో 2017 నవంబరు 19న అప్పటి చందోలు ఎస్‌ఐ చెన్నకేశవులు దాడులు నిర్వహించగా 470 గ్రాములు గంజాయి దొరికిందని కేసు నమోదు చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన ఈ కేసులో నజీర్‌బాషా, మారెడ్డి రోహిత్‌కుమార్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంలకు శిక్షపడింది. గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టులో కేసు విచారణకు రాగా జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు సూచనలతో బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ పర్యవేక్షణలో చందోలు ఎస్సై శివకుమార్, కోర్ట్ లైజనింగ్ ఏఎస్‌ఐ ఉప్పల భాస్కర్ ద్వారా సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏపీపీ వజ్రాల రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించి ముద్దాయిలపై మోపబడిన నేరాన్ని తగిన సాక్ష్యాలతో రుజువు చేయడంతో గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఏ.ఎల్ సత్యవతి గురువారం ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 10,000 నగదు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈమేరకు ఎస్పీ తుషార్ డూడీ పోలీసులను అభినందించారు.
ఆటో బోల్తా.. మహిళ మృతి
చినగంజాం : ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయలైన సంఘటన చినగంజాం మండల పరిధిలోని తిమ్మసముద్రం సైఫన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మండలంలోని కడవకుదురు గ్రామానికి చెందిన పలువులు మహిళా కూలీలు ఇంకొల్లు మండల పరిధిలోని పావులూరు గ్రామంలో మిర్చి పంట పనులకు గత మూడు నెలలుగా ప్రతి రోజు వెళుతున్నారు. రోజు మాదిరిగానే కడవకుదురు గ్రామం నుంచి గురువారం ఉదదయం 5 గంటల ప్రాంతంలో బయలుదేరి వెళుతున్న వారి ఆటో ఇంకొల్లు రోడ్డులోని తిమ్మసముద్రం సైఫన్ వద్దకు వెళ్ళే సరికి ఆటో హ్యాండిల్ అకస్మాత్తుగా బిగుసుకొని పోవడంతో పక్కనే కుడివైపు ఉన్న పొలాల్లోకి దూసుకొని వెళ్ళి బోల్తా కొట్టింది. ఆ సంఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిలో నక్కల సోవమ్మ (79)ను తీవ్ర గాయలు కావడంతో 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న బత్తుల కమలమ్మ తలకు గాయం కాగా ఒంగోలు కిమ్స్‌కు, కొండేపు శేషమ్మ, డ్రైవర్ గొల్లపూడి వెంకటేశ్వర్లుకు గాయాలు కావడంతో వైద్యచికిత్స నిమిత్తం చీరాల తరలించారు. బాధితురాలు కొండేపు శేషమ్మ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శీలం రమేష్ తెలిపారు.