వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు
గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడితూరి అనూష (అలియాస్ తనూజ20) ఆదివారం రాత్రి మృతి చెందగా.. తమ కుమార్తె మృతిపట్ల అనుమానాలున్నాయంటూ మృతురాలి తండ్రి రమణ గజపతినగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాస్ సోమవారం తన బృందంతో గ్రామంలోని సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో మృతురాలి బంధువులు, తోటి స్నేహితులను వాకబు చేశారు.
అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగుమాసాల క్రితం ఇదే గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్‌తో అనూషకు వివాహమైంది. కాపురం ఆనందంగానే సాగుతోందని, అయితే ఆమె వివాహానికి ముందు ఇదే గ్రామానికి చెందిన బోనివెంకటదుర్గాప్రసాద్ అనూషను ప్రేమించాడని, వివాహమైన తరువాత కూడా చీటికీమాటికీ వేధింపులకు గురిచేసినట్లు తెలిసిందన్నారు. ఈ వేధింపులు ఇటీవల బాగా అధికమవడం, తనతో పాటు బయటకు వచ్చి కోరిక తీర్చాలని, లేకుంటే నీతో తీసుకున్న సెల్ఫీలు, ఆడియో, వీడియో కాల్స్ గ్రామంలోని అందరికి చూపిస్తానని పదేపదే బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
చనిపోయేముందు స్నేహితురాలికి, తన అన్నయ్యకు ఫోన్ చేసి అనూష ఈ సమాచారం పంపించిందని, ఈ సమాచారం ఆధారంగా ఈవిషయాలను తెలుసుకున్నామన్నారు.పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. నివేదిక ఆధారంగా పూర్తిస్ధాయి వివరాలను తరువాత వెల్లడించనున్నామని తెలిపారు. ఈ పరిశీలనలో సీఐ ప్రభాకర్, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment