అరచేతిలో వైకుంఠం... అమల్లో ఎగనామం!
● కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు ● సూపర్ సిక్స్ అమలుపై కరిగిపోయిన సామాన్యుల ఆశలు ● 2025–26 పూర్తిస్థాయి బడ్జెట్‌లో కనిపించని సంక్షేమ పథకాలు ● ప్రస్తావించిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలపైనా సందేహాలు ● అమలయ్యేవరకూ చెప్పలేమంటున్న ప్రజానీకం ● అన్నీ కంటితుడుపు కేటాయింపులేనని పెదవి విరుపు
మరికొన్ని కేటాయింపులు...
●భోగాపురం ఎయిర్‌పోర్టు అనుసంధాన రహ దారి నిర్మాణానికి ఇంకా 40 ఎకరాల భూసేకరణకు సంబంధించి రూ.195 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
●పార్వతీపురం మన్యం జిల్లా సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నెలకొన్న ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఎలిఫెంట్‌కు కేవలం రూ.1.28 కోట్లే కేటాయించారు.
●విజయనగరంలోని జేఎన్‌టీయూ–గురజాడ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతు ల కల్పనకు సాయంగా సుమారు రూ. 5.60 కోట్లు ప్రతిపాదించారు. దీంతో పాటు కురుపాంలోని గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు కలిపి భవనాలు, ల్యాబ్‌ల నిర్మాణం కో సం మరో రూ.3.40 కోట్లు కేటాయించారు.
●విజయనగరం శివారులోని కోరుకొండ సైనిక్‌స్కూల్‌తో పాటు కలికిరి సైనిక్ స్కూ ల్‌కు కలిపి అదనపు నిర్మాణాల కోసం రూ.2 కోట్లు ప్రతిపాదించారు.
●గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.110 కోట్లు ప్రతిపాదించారు.
●గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన విజయనగరం సహా రాష్ట్రంలోని మరో ఆరు బోధనాసుపత్రులకు కలిపి రూ.375 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అరకొర నిధులతో విజయనగరం మెడికల్ కాలేజీలో రెండో దశ నిర్మాణాలు వేగవంతమయ్యే అవకాశం కనిపించట్లేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
టీడీపీ, జనసేన, బీజేపీ కలగలిపిన కూటమి ప్రభుత్వం మాది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారం తమదే.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ టీడీపీ, జనసేన నాయకులు చెప్పుకొనే గొప్పలు చూస్తే అబ్బో అనిపిస్తాయి! తీరా రాష్ట్ర బడ్జెట్ చూస్తే మాత్రం అంతా అంకెల గారడీనే కనిపిస్తుందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అమలుచేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, అంతకుమించి సూపర్ సిక్స్ పథకాలను అమలుచేస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలకు ఎగనామం పెట్టేశారు. అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక రానున్న సంవత్సరం కూడా సూపర్ సిక్స్ పథకాలు అందవన్న విషయం శుక్రవారం నాటి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు చూసిన తర్వాత స్పష్టమైంది. సామాన్యుల ఆశలు కరిగిపోయాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రస్తావించినా తర్వాత వాటి ఊసే లేదు. వాటినే మళ్లీ తాజా పూర్తిస్థాయి బడ్జెట్ 2025–26లోనూ ప్రతిపాదించినా అరకొర నిధులే కేటాయించడంతో అవెంత వరకూ అమలుచేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్‌లోని మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. దీంతో ఈ బడ్జెట్ సామాన్యులకు కంటితుడుపు మాదిరిగానే ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు.
రైతులకు సాయం అందేనా?
పెట్టుబడి సాయం కింది ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామనేది టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ. గత తాత్కాలిక బడ్జెట్‌లోనే ఇస్తామని ప్రతిపాదించినా ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రంలో 53.5 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద దఫదఫాలుగా సాయం అందించేందుకు రూ.6,300 కోట్లు ప్రతిపాదించారు. అమలయ్యేవరకూ అనుమానమే. రైతుసేవా కేంద్రాలుగా పేరుమార్చిన రాష్ట్రంలోని 10778 రైతుభరోసా కేంద్రాలకు నిర్వహణ ఖర్చుల కింద కేవలం రూ.19.42 కోట్లు మాత్రమే ప్రతిపాదించారంటే... వాటిని మరింత నిర్వీర్యం చేయ డానికేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయాధారిత విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇవెంతగానే ఉపయోగపడిన విషయం తెలిసిందే. మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతే కొనుగోలు చేసి రైతులను ఆదుకొనేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది.
సాగునీటి పథకాలకు అరకొరగా నిధులు..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన కుమారుడు, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిధులు కేటాయిస్తూ వచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల పనులపై కినుక వహించింది. కాలువల నిర్మాణానికి సంబంధించి జంఝావతి, తోటపల్లి కొత్త ఆయకట్టుతో కలిపి వెంగళరాయసాగర్ విస్తరణకు అవసరమైన 21 ఎకరాల భూసేకరణకు, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు మిగులు పనులకు, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌కు అవసరమైన 240 ఎకరాల భూసేకరణకు, పాత తోటపల్లి బ్యారేజ్ ఆధునికీకరణ, పెద్దేరు రిజర్వాయరు, మడ్డువలస రిజర్వాయరు మిగులు పనులన్నింటికీ కలిపి కేవలం రూ.54.73 కోట్లు మాత్రమే ప్రతిపాదించడమే దీనికి నిదర్శనం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605.75 కోట్లు, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకు రూ.47.80 కోట్లు ప్రతిపాదించారు. మిగులు పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు కలిపి తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు రూ.68 కోట్లు కేటాయించారు.
●కోతల బడ్జెట్
సంపద సృష్టించి సంక్షేమా న్ని ప్రజలకు చేరువచేస్తామన్నారు. ద్రవ్య, రెవెన్యూ లోటే చూపించారు. సంక్షే మ పథకాల అమలులో కోతలు తప్పవని బడ్జె ట్ సాక్షిగా చెప్పారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగా కల్పన ఊసే లేదు. – పాలవలస విక్రాంత్,
రాష్ట్ర శాసన మండలి సభ్యుడు
●మాయా బడ్జెట్
టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలకు మొండిచేయి చూపారు. ఉచిత బస్సు సదుపాయం, 18 నుంచి 60 సంవత్సరా ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నా పథకాల ఊసేలేదు.
– బడ్నాన ప్రమీల, ఎంపీపీ పాచిపెంట
●నిరాశ జనక బడ్జెట్
ఉద్యోగులకు ఇది నిరాశాజనక బడ్జెట్. పీఆర్‌సీ బకాయిలు, డీఏలు, తదితర కేటాయింపులు లేకపోవడం విచారకరం.
– ఎ.సూర్యనారాయణ,
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
అరచేతిలో వైకుంఠం... అమల్లో ఎగనామం!
అరచేతిలో వైకుంఠం... అమల్లో ఎగనామం!
అరచేతిలో వైకుంఠం... అమల్లో ఎగనామం!
Comments
Please login to add a commentAdd a comment