విజయనగరం క్రైమ్: స్థానిక కంటోన్మెంట్‌లో గల పోలీస్ పరేడ్ మైదానంలో మహిళా పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ యోగ శిక్షణను ఆదివారం అందజేసింది. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించారు. యోగా అనేది శరీరానికి, మనసుకు, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ, హార్మోనల్ సవాళ్లను ఎదుర్కొంటారని, వాటిని అధిగమించడానికి యోగసాధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. యోగాతో హార్మోనుల సమతుల్యత సాధించి థైరాయిడ్, ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చునన్నారు. యోగాతో మహిళల్లో సహనశక్తి పెరుగుతుందని, ఆందోళన, ఒత్తిడి, నిద్ర సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. నిరంతరం యోగ సాధన చేయడం వల్ల మహిళల్లో ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరిగి, పనుల్లో మంచినిర్ణయాలు తీసుకుంటూ, జీవితంలో సమర్థవంతమైన వ్యక్తులుగా రాణిస్తారని అభిప్రాయ పడ్డారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడంతో శారీరక, మానసిక ఆనందాన్ని పొందవచ్చునని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. మహిళా పోలీస్స్టేషన్ సీఐ ఈ.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగా శిక్షణ తరగతుల్లో ఆర్‌ఐ ఎన్.గోపాలనాయుడు, ఎస్సైలు పద్మావతి, నరసింగరావు, ఎఆర్ ఎస్సై కె.రమేష్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment