మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహిళా దినోత్సవం నిర్వహణపై సోమవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవంలో మహిళలందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రేరణ, సఖి కింద ప్రభుత్వ శాఖల్లో పదవులు అధిరోహించిన మహిళలు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, క్రీడలు, వ్యవసాయంలో రాణించిన మహిళలు, సంగీత కళాకారులు, పారిశుద్ధ్యం, ఆశ, వైద్య రంగాలలో విశేష సేవలందించిన మహిళలందరినీ గుర్తించాలని సూచించారు. ఆ మహిళల ద్వారా ఇతరులు ప్రారణ పొందాలని అభిప్రాయపడ్డారు.
మహిళల ఎంపికలో పారదర్శకత అవసరం
మహిళల ఎంపికలో పారదర్శకత అవసరమని, అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని కలెక్టర్ చెప్పారు. అన్ని నియోజక వర్గాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ మిగిలిన అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని, మహిళలు తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తులు, తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం చేపడుతున్న న్యూట్రీకిట్ల పంపిణీ, పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు ఏర్పాటు చేసిన భవిత తదితర అంశాలు ఆవిష్కృతం కావాలని పిలుపునిచ్చారు.
నేడు హెల్దీ ఉమెన్.. హ్యాపీ ఉమెన్
ఈనెల 4న హెల్దీ ఉమెన్..హ్యాపీ ఉమెన్ పేరిట యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, మండల స్థాయి విజేతలకు ఈనెల 6వ తేదీన, జిల్లాస్థాయిలో విజేతలకు ఈనెల 7వ తేదీన అవార్డుల ప్రదానం చేపట్టాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ హేమలత, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, మెప్మా పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, పరిశ్రమల మేనేజర్ ఎంవీ కరుణాకర్, డీపీఆర్‌ఓ ఎల్.రమేష్, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య, డీఎస్‌డీఓ ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment