శ్రీరామ రామ రామేతి..!
● అజరామరం గుళ్ల సీతారాంపురంలోని ఆలయం
● 500 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారాముల ఆలయం
● ఆలయంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం నిర్వహణ
రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలో గల గుళ్ల సీతారాపురం గ్రామంలో వెలసిన సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో సీతారాములు స్వయంభూగా వెలిశారు. ఆనాడు ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో ఆలయం నిర్మాణంతో పాటు గ్రామం నిర్మించారు. సీతారాంపురం గ్రామాలు ఎక్కువగా ఉండడంతో గుడి సీతారాంపురంగా ఈ గ్రామాన్ని పిలిచేవారు. కాలక్రమేణా అది గుళ్ల సీతారాంపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయానికి బొబ్బిలి రాజులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయం మొత్తం రాళ్ల పేర్పుతో నిర్మించిన అద్బుత కట్టడం. ఈ ఆలయంలో గాలిగోపురం దాదాపు 65 అడుగుల పొడవు ఉంటుంది. గాలిగోపురం పైకి ఎక్కితే బొబ్బిలిలోని వేణుగోపాలుని ఆలయం గాలి గోపురం కనిపిస్తుందని ప్రాశస్త్యం. స్వయంభూగా వెలిసిన ఇక్కడి సీతారాములు ఏకాంతవాసంలో ఉన్నట్లు ఏకశిలపై ఉండడం విశేషం. ఏ ఆలయంలో అయినా సీతారాములతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. కానీ ఈ ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు, శంఖుచక్రాలు, ధనుర్బాణాలు ఉండవు. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ బేడాను ఏర్పాటు చేశారు. ఈ
బేడాను అనుసరించి ఆళ్వారులు, రాధాకావతులు, రామానుజుల వారు, నమ్మాళ్వాల్, గరుడాళ్వాల్, మానవాళ్ల మహాముని, దాసాంజనేయులకు ప్రత్యేకంగా సన్నిధులను ఏర్పాటు చేశారు.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జేష్ఠ శుద్ధ ఏకాదశినాడు ఉదయం రాధాకాంతుల కల్యాణం, రాత్రి సీతారాముల కల్యాణం, శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు పవిత్రోత్సవాలు, 30 రోజులపాటు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు భోగాపురపు ప్రసాదరావు తెలిపారు.
అంగరంగ వైభవంగా డోలా పౌర్ణమి
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు(డోలా పౌర్ణమి) స్వామి వారిని ఆంజనేయ వాహనం, సర్ప వాహనంపై ఊరేగింపుగా ఉత్తర ముఖ మంటపానికి వేంచేసి భక్తకోటి అందరికి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ స్వామి వారికి ఊంజల్ సేవ చేస్తారు. దీనినే డోలోత్సవం అంటారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు డోలాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ఏటాలాగానే ఈ నెల 14 నుంచి 16 వరకు డోలాయాత్ర నిర్వహించనున్నారు.
ఆలయాని చేరుకోవడమిలా..
రాజాం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం..సంతకవిటి మండకేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజాం నుంచి బస్సు సౌకర్యం ఉంది. రాజాం నుంచి మందరాడ, సంతకవిటి, మండాకురిటి బస్సు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.
శ్రీరామ రామ రామేతి..!
శ్రీరామ రామ రామేతి..!
శ్రీరామ రామ రామేతి..!
Comments
Please login to add a commentAdd a comment