శృంగవరపుకోట: పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్న వ్యక్తి మనోవేదనతో మృతిచెందాడు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు, పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాలిలా ఉన్నాయి. నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కొరువాడ శ్రీనివాసరావు(43) పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వేర్వేరు వ్యాపారాల్లో నష్టాలపాలైన శ్రీనివాసరావు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు భార్యతో గొడవపడి విడాకుల వరకూ వెళ్లాడు. కోర్టులో వారి విడాకుల కేసు నడుస్తుండడంతో శ్రీనివాసరావు భార్య కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కొంతకాలంగా తన ఇంటి మేడ మీది గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. మూడు రోజులుగా శ్రీనివాసరావు కనిపించలేదని, బయటకు రాలేదని కింది పోర్షన్‌లో ఉన్న వారు స్థానికులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇంటికొచ్చి తలుపులు తెరిచి, చూడగా శ్రీనివాసరావు చనిపోయి మంచంపై పడి ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment