ఓ వైపు సంక్షేమ పథం.. మరోవైపు అభివృద్ధి మంత్రంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పవనాలు బలంగా వీయడంతో ఏజెన్సీ ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు చేరువయ్యాయి. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెందాయి. మారుమూల గ్రామాలకు రోడ్ల సదుపాయాలు కలిగాయి. దీనికి సీతంపేట మన్యంలో కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2019–2024 వరకు ఐదేళ్ల పాలనలో రూ.50 కోట్లతో సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరైంది. మరో రూ.20 కోట్లతో 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 47 ఆశ్రమపాఠశాలల్లో ‘నాడు–నేడు’ నిధులు రూ.20 కోట్లతో మౌలికవసతులు కల్పించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేశారు. దాదాపు వందకు పైగా గ్రామాలకు రూ.69 కోట్ల వ్యయంతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. కొండలపై నుంచి జాలువారే వర్షపు నీరు గిరిజన గూడలను ముంచెత్తకుండా 114 వరదగోడలు నిర్మించారు. సీతంపేటలో స్కిల్ కళాశాల ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ.. ఆపైన చదివిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. నెట్‌వర్క్ లేని గ్రామాలకు సెల్ సిగ్నల్ కోసం 53 ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక సేవలు అందుకునేందుకు అవకాశం కల్పించారు. పర్యాటకానికి పెద్దపీట వేస్తూ రూ.2 కోట్ల ఖర్చుతో ఆడలి వ్యూ పాయంట్‌ను వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి చేశారు. రూ.కోటి ఖర్చుతో జగతపల్లి వ్యూ పాయింట్ పనులు సైతం జరిగాయి. రూ.10 కోట్లతో సీతంపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. రైతన్నకు ఆర్థిక అండ అందించడంతో పాటు 25 వేల ఎకరాల కొండపోడు భూములకు సంబంధించి 15వేల మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అందుకే సమావేశమైనా.. వేదిక ఏదైనా మాజీ ఎమ్మెల్యే కళావతి తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఘనంగా చెప్పుకుంటున్నారు. చేసిన మేలును గిరిజనులు తెలియజేస్తుంటే సంతోషపడుతున్నారు. ప్రస్తుత కూటమి నేతలు ఉత్తుత్తి మాటలతో కాలక్షేపం చేయకుండా గిరిజనులకు మేలుచేసే పనులు చేయాలని కోరారు.
– సీతంపేట
Comments
Please login to add a commentAdd a comment