●మహిళల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
● ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి
పార్వతీపురంటౌన్: మహిళల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని, మహిళలు కూడా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి సూచించారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో హహిళలను గౌరవిస్తూ ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తుచేశారు. బాల్యవివాహ వ్యవస్థను నిర్మూలించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాలికలు సైబర్ నేరగాళ్ల మోసపూరిత మాటలు, ప్రలోభాలకు గురికారాదని హితవు పలికారు. ఆడపిల్లలు అన్నింటా రాణించాలంటే విద్య ఒక్కటే మార్గమని, ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, ఐసీడీఎస్ పీడీ డాక్టర్ టి.కనకదుర్గ, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment