ఎంత కష్టమొచ్చింది..!
తల్లీ.. నీకు
కళింగ
సైనీ (ఫైల్)
● మడ్డువలస కుడికాలువలో పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
● ఏడేళ్ల కుమార్తె సైనీ గల్లంతు
వంగర:
ఓ వైపు మానసిక స్థితి సరిగాలేక
దూరంగా ఉంటున్న భర్త..
మరోవైపు పెద్దవారవుతున్న
పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత..
అన్నింటికీ తల్లిదండ్రులపైనే
ఆధారపడాల్సిన పరిస్థితులు..
ఆ తల్లిని మనోవేదనకు గురిచేశాయి.
ఆర్థికంగా, మానసికంగా కుంగదీశాయి.
నవమసాలు మోసి కనీపెంచిన పిల్లలను బలవంతంగా లాక్కొచ్చి కాలువలో దూకి ప్రాణాలు తీసుకునేంత స్థాయికి దిగజార్చాయి. ఓ యువకుడి సాహసంతో ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడు ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె గల్లంతైన విషాదకర ఘటన వంగర మండలం మడ్డువలస కాలువ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
వంగర మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన గుంట తవుడు, కళావతిల రెండో కుమార్తె శ్రావణికి పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళింగ సుధాకర్‌తో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సిద్ధు, సైనీ(7)లు పుట్టిన తరువాత భర్త సుధాకర్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో శ్రావణి కింజంగిలోని తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఐదేళ్లుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటూ పొందూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో ఎనస్తీషియాలో డిప్లమా చేస్తోంది. కుమారుడు సిద్ధు రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఐదో తరగతి, కుమార్తె సైనీ కింజంగి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల కిందట గరుగుబిల్లి మండలం బురదవెంకటాపురంలోని అక్క సంధ్య ఇంటికి పిల్లలతో కలిసి వెళ్లింది. కుమారుడుని ఉంగరాడమెట్ట వద్ద గురుకులానికి తీసుకెళ్తానని చెప్పి మంగళవారం తిరుగుప్రయాణమైంది.
మార్గం మధ్యలో వంగర మండలంలోని మడ్డువలస కుడి ప్రధాన కాలువ వద్దకు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చేరుకుని పిల్లలతో కలిసి దూకేసింది. చేపల వేటకు అటువైపుగా వెళ్తున్న సంగాం గ్రామానికి చెందిన యువకుడు జన్ని జగన్‌మోహన్(చిన్ని) వారిని గమనించి హుటాహుటిన కాలువలోకి దూకి శ్రావణి, సిద్ధులను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. బాలికను కాపాడే ప్రయత్నంలో మరోసారి శ్రావణి తన కుమారుడితో కలిసి దూకేయడంతో మళ్లీ ఒడ్డుకు చేర్చాడు. ఇంతలో బాలిక సైనీ నీటిలో కొట్టుకు పోయింది. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ షేక్‌శంకర్, వంగర తహసీల్దార్ దిరిశాల ధర్మరాజు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మడ్డువలస ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చి కాలువ హెడ్‌స్లూయీస్ వద్ద గేట్లు మూసివేయించారు. గజఈతగాళ్లు, మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక గల్లంతైనట్టు కేసు నమోదు చేశారు. భర్తకు దూరంగా ఉండడం, మానసిక, ఆర్థిక సమస్యలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు ఎస్‌ఐ తెలిపారు. సైనీ గల్లంతుతో తాత, అమ్మమ్మలు బోరున విలపించారు.
ఎంత కష్టమొచ్చింది..!
ఎంత కష్టమొచ్చింది..!
Comments
Please login to add a commentAdd a comment