డీకేటీ రైతులకు అన్యాయం..!
పార్వతీపురంటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. రైతులకు ఆ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రస్తుతం వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నాయి. అయితే భవిష్యత్‌లో రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల యోజన బీమా, సబ్సిడీ పరికరాలు, పంట నష్టపరిహారం, ఎరువుల రాయితీ, కనీస మద్దతు ధర తదితర పథకాలను అందించేందుకు ప్రత్యేక కార్డులను అందించనున్నారు. ఇందుకోసం అర్హులైన ప్రతి రైతుకు ఆధార్‌కార్డు తరహాలో వ్యవసాయ శాఖ ద్వారా 14అంకెల యూఐడీ కేటాయిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సొంత పట్టా భూములు ఉన్న రైతుల వివరాలు మాత్రం నమోదు చేసి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తున్నారు. కానీ డీకేటీ పట్టాలు ఉన్న రైతుల వివరాలు నమోదు చేయడం లేదు. ఇందుకు ఆన్‌లైన్‌లో అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డీకేటీ రైతులు తమకు పథకాలు, నిధులు అందుతాయో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు.
కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా?
జిల్లాలో గల 15 మండలాల్లో గడిచిన రెండు వారాలుగా అన్ని గ్రామాల్లో రైతులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయింపు కోసం వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి భూమి పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ద్వారా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో కూడా నమోదు ప్రక్రియ జరుగుతోంది. కానీ డీకేటీ రైతులకు మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు అవడం లేదంటూ చెప్పి పంపించేస్తున్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? అంటూ డీకేటీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో డీకేటీ రైతుల వివరాలు
యూనిక్ ఐడీ కోసం డీకేటీ భూములున్న ఏ ఒక్క రైతుకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 24,245 మంది రైతులు డీకేటీ పట్టాలు కలిగి ఉన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 36,483 మంది రైతులు నమోదు కావాల్సి ఉంది. ఆ రైతులందరూ యూనిక్ ఐడీ కార్డులు మాకు ఇవ్వరా? కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మా పరిస్థితి ఏమిటి అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అనుమతి వస్తే నమోదు చేస్తాం
ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే, వెబ్‌సైట్‌లో ఆప్షన్ వచ్చిన వెంటనే డీకేటీ రైతుల వివరాలు నమోదు చేస్తాం. ప్రస్తుతం సొంత పట్టాదారులకు సంబంధించి యూనిక్ ఐడీలను అప్‌లోడ్ చేస్తున్నాం. త్వరలోనే అనుమతి వస్తుందని సమాచారం. త్వరలో వారివి కూడా యూనిక్ ఐడీల నమోదు ప్రక్రియ చేపడతాం. – రాబర్ట్‌పాల్,
జిల్లా వ్యవసాయశాఖాధికారి,
పార్వతీపురం మన్యం
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో
సొంత పట్టాదారులకే నమోదు
వారికే యూనిక్ ఐడీల కేటాయింపు
డీకేటీ రైతులకు నమోదు
అవదంటున్న అధికారులు
ఆందోళనలో రైతులు
డీకేటీ రైతులకు అన్యాయం..!
Comments
Please login to add a commentAdd a comment