● తగ్గుతున్న జలాశయాల నీటి మట్టాలు
బొబ్బిలి:
అన్నదాతకు, అటు మూగజీవులు, ప్రజానీకానికి దాహార్తిని తీర్చే జలాశయాలు నీటి నిల్వలను మార్చి నెలలోనే కోల్పోవడం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాల నీటి మట్టాలు తగ్గుముఖం పట్టే ఛాయలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నీటి మట్టాలు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చాలా చోట్ల పశువుల దాహార్తిని తీర్చేందుకు, ఆరుతడి పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందా.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి వనరుల్లో ఒక భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టు ఉండగా మిగతావి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వీటి ద్వారా ఏటా ఖరీఫ్‌లోనే సాగునీటిని విడుదల చేస్తున్నారు. రబీలో ఆరుతడి పంటలకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటోంది. వీటిని ఏటా జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి రబీకి సాగునీటిని విడుదల చేయాలా.. వద్దా.. అనేది నిర్ణయిస్తారు. దీని ప్రకారం రైతులు తమ పంటలను సాగు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది సాగునీటి నిల్వలు తగ్గే పరిస్థితి నెలకొంది. మార్చి నెలలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు మీటర్ల మేర తగ్గుతూ కనిపిస్తోంది. వేసవిలో అకాల వర్షాలు, తుఫాన్ల వంటివి సంభవిస్తే తప్ప మే నెలాఖరుకు మరింత నీరు ఇంకిపోయే పరిస్థితులున్నాయి. ఇది అందరినీ కలవరపరుస్తోంది.
వీఆర్‌ఎస్‌లో కొద్ది రోజుల కిందటి నీటి నిల్వలు
వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు
వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు