సాలూరు రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల వివాదాన్ని పరిష్కరించాలని, గిరిజనులపై ఒడిశా ప్రభుత్వ దౌర్జన్యాలను ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోవాలంటూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎగువసెంబిలో గిరిజనులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ నాయకుడు మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ 21 కొటియా గ్రామా ల సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. ఒడిశా–ఆంధ్రాలో ఒకే ప్రభుత్వం ఉన్నందున సమస్యకు చెక్ చెప్పాలన్నారు. ఎన్నో ఆశలతో మంత్రి సంధ్యారాణిని గెలిపించినా సమస్య పట్టించుకోవడం లేదన్నారు. సెంబిలో ఒడిశా అధికారులు కంచె వేసి గిరిజనుల భూములను ఆక్రమించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గెమ్మెల జానకిరావు, కోనేటి సుబ్బా, తాడంగి చరణ్, మర్రి మహేష్, తదితరులు పాల్గొన్నారు.