జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, గవరమ్మపేట, బాసంగి, చింతలబెలగాం పరిసరాల్లోని పంట పొలాలను ఏనుగులు వారంరోజుల నుంచి వీడడం లేదు. బుధవారం ఉదయం వెంకటరాజపురంలోని అరటి, పొట్టతో ఉన్న వరి పంటను ధ్వంసం చేయడంతో రైతులకు నష్టంవాటిల్లింది. స్థానిక కూటమి నేతలు స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
గిరిజన గురుకుల
ప్రవేశపరీక్ష వాయిదా
సీతంపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, మిగిలిన తరగతుల్లో ఖాళీలకు వచ్చేనెల 6వ తేదీన జరగనున్న రాతపరీక్ష అదే నెల20కు వాయిదా పడినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
నేడు ఇఫ్తార్ విందు
పార్వతీపురం టౌన్: రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును పార్వతీపురం పట్టణంలోని లయన్స్ క్లబ్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటుచేస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్‌ఎస్ జాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
పోలమాంబ 9వ జాతర ఆదాయం రూ.2.36లక్షలు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి తొమ్మిదవ వారం జాతర ఆదాయాన్ని ఈవో వి.వి.సూర్యనారాయణ సమక్షంలో బుధవారం లెక్కించారు. శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, కేశ ఖండన టికెట్ల విక్రయ రూపంలో రూ.89,260, మహా అన్నదానం విరాళాల రూపంలో 81,335, లడ్డూ, పులిహోర ప్రసాదం విక్రయంతో రూ.66,105ల కలిపి రూ.2,36,700ల ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు.
రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం టౌన్: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో రుణాల కోసం మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏపీఎస్‌ఎమ్‌ఫ్‌సీ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కార్యనిర్వహక సంచాలకులు ఆర్.ఎస్.జాన్ బుధవారం ప్రకటనలో తెలిపారు. పథకం కింద గరిష్ఠ ప్రాజెక్టు వ్యయపరిమితి తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షలు రుణం అందజేస్తారన్నారు. ప్రాజెక్ట్ ఏర్పాటు చేయు ప్రాంతం, లబ్ధిదారుల వర్గీకరణను బట్టి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ప్రాజెక్టు విలువలో 15 శాతం నుంచి 35 శాతం వరకు ఉంటుందన్నారు. లబ్ధిదారుని వాటాగా సాధారణ వర్గానికి చెందిన వారికి 10 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు, ట్రాన్స్ జెండర్‌లు, మాజీ సైనికులు, దివ్యాంగులు తదితర వారికి 5 శాతంతో ఏదైనా బ్యాంక్ నుంచి రుణ సహాయం కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియను ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. 86 రోజులకు చదురుగుడి హుండీల నుంచి రూ.34,51,576లు, 35 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 449 గ్రాముల వెండి, వనంగుడి హుండీల నుంచి రూ.9,43,375లు, 6 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 682 గ్రాముల వెండి లభించిందని ప్రసాద్ తెలిపారు. అన్నదానం హుండీల నుంచి రూ.45,823లు వచ్చిందన్నారు. కార్యక్రమంలో రామతీర్థం ఆలయ సహాయ కమిషనర్ వై.శ్రీనివాసరావు, శ్రీవారి సేవకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.