సీతంపేట: గిరిజనుల వద్ద నుంచి కొండచీపుళ్ల కొనుగోలుకు అడ్వాన్స్ టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, జీసీసీ డీఎం సంధ్యారాణి సమక్షంలో టెండర్లు నిర్వహించారు. 16 మంది టెండర్‌దారులు హాజరయ్యారు. గిరిజన సహకార సంస్థ ఒక్కో కొండచీపురు గ్రేడ్ వన్ గిరిజనుల వద్ద నుంచి రూ.45కి కొనుగోలు చేసి రూ.47కు వ్యాపారులకు విక్రయిస్తుంది. గ్రేడ్ టు చీపురు ఒకటి రూ.40కి కొనుగోలు చేసి రూ.42కు, గ్రేడ్–3 చీపురు కట్ట రూ.35కు కొనుగోలు చేసి రూ.37కు వ్యాపారులకు విక్రయించనున్నారు. కొండచీపురు కొనుగోలు చేసిన ధరపై రూ.2 మార్జిన్‌ను కలిపి సేల్ బిల్లు వ్యాపారులకు ఇవ్వనున్నారు. అటవీశాఖ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పర్మిట్లు కూడా జీసీసీ ఇవ్వనుంది. వారపు సంతల వద్దే కొనుగోలు చేసి వెంటనే వ్యాపారులకు విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.