అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
● ‘మిస్ తెలుగు యుఎస్‌ఏ’ తుదిపోటీలకు సాయిసాత్విక
● ఆమెది తెర్లాం మండలం సోమిదవలస గ్రామం
● మే నెలలో జరగనున్న ఫైనల్ పోటీలు
తెర్లాం: అమెరికా మెచ్చిన అందం మన తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి చందక సాయిసాత్విక సొంతం. ఓ వైపు చదువు.. మరోవైపు అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. ఎమ్మెస్సీ చదువుకోసం అమెరికా వెళ్లిన యువతి డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘మిస్ యూఎస్‌ఏ–2025’ పోటీల్లో తలపడి తుదిపోటీలకు ఎంపిక కావడం తెర్లాం మండలం సోమిదవలస వాసుల్లో ఆనందం నింపింది. మే 25న జరగనున్న ఫైనల్ పోటీల్లో తలపడనుంది. తను విజయం సాధించడానికి భారతీయులంతా తనకు ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిచేస్తోంది. సాయిసాత్విక తండ్రి చందక సూర్యకుమార్ మెకానికల్ ఇంజినీరు కాగా, తల్లి సబిత రేషన్ డీలర్. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాజాంలోని సెంట్‌ఆన్స్ పాఠశాలలో, బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో చదువుకుంది. డేటా ఎనలైటికల్ కోర్సులో ఎమ్మెస్సీ చదవడం కోసం అమెరికా వెళ్లింది. అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్ట్రిన్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అక్క సాయిసుస్మిత, బావ వద్ద ఉంటూ మిస్ తెలుగు యుఎస్‌ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 300 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొన్న పోటీల్లో ఫైనల్‌కు చేరుకుంది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావాలన్నది సాయిసాత్విక కోరికని, చిన్నతనం నుంచి వ్యాసరచన పోటీల్లో తలపడి బహుమతులు గెలుచుకుందని తల్లి సబిత తెలిపారు. అమెరికా తెలుగు అమ్మాయిల పోటీల్లో కుమార్తె విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ ఓటుతో మద్దతు తెలపాలని కోరారు.