పక్కా డాక్యుమెంట్ రీ సర్వే జరగాలి
కొమరాడ: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత రీ సర్వేలో డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని, సమగ్ర విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా రెండవ విడత రీ సర్వే పనులపై తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రీ సర్వే చేపడతున్న గ్రామల్లో ముందుగా రైతులకు సమాచారం అందించి తగు రశీదులను పొందాలని స్పష్టం చేశారు. భూముల రీసర్వేలో తలెత్తిన లోపాలను భూయజమానికి ముందుగా నోటీస్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలు ఆయా రిజిస్టర్లలో నమోదు చేయాలని చెప్పారు. రీ సర్వేలో ఎక్కడా లోపాలు ఉండరాదని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్డార్ శివయ్య మండల సర్వేయిర్ వంశీ తదితరులు పాల్గున్నారు.