
మాటిచ్చి.. మాయచేశారు..!
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు రూ.20వేలు పెట్టుబడి సాయం అన్నారు.. తుస్‌మనిపించారు. అమ్మఒడిని కాస్త తల్లికి వందనంగా పేరుమార్చి.. ఏడాదిగా ఏమార్చారు. చేనేత కార్మికుడు సాయం అడిగితే.. రిక్తహస్తం చూపిస్తున్నారు. నిరుద్యోగ భృతిపై ప్రశ్నించిన యువతపై.. కన్నెర్రచేస్తున్నారు. ఉగాది సాక్షిగా వలంటీర్లను కొనసాగిస్తామని... జీతం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని.. తుంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం తీరుపై జనం భగ్గుమంటున్నారు. చంద్రబాబు అండ్ కో తీరుతో జిల్లాలోని 530 సచివాలయాల పరిధిలోని 8,774 వలంటీరు కుటుంబాలు ఉపాధిలేక రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. ఉగాది వేళ గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వలంటీర్లకు అందజేసిన ప్రోత్సాహకాలను తలచుకుని ప్రస్తుత ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. – పార్వతీపురంటౌన్
● ఆశ చూపి.. పొట్టకొట్టిన కూటమి
● గౌరవవేతనం రూ.10 వేలకు
పెంచుతామంటూ గతేడాది ఉగాది రోజున ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రకటన
● ఎవరినీ తొలగించం అంటూ హామీ
● అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైనం
● రోడ్డున పడిన 5,638 మంది
వలంటీరు కుటుంబాలు
జగనన్న ఉంటే బాగుండేది.
గతంలో జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజలకు సేవలందించే అవకాశం కల్పించారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను అందించేవారు. రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించేవాళ్లం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్ల వ్యవస్థను రద్దుచేశారు. మాకు అన్యాయం చేశారు.
– సౌజన్య, వలంటీర్, పార్వతీపురం పట్టణం
నమ్మించి మోసం చేశారు
కూటమి నేతలు ఎన్నికల ముందు వలంటీరుకు రూ.10వేలు వేతనం అందజేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టిన తరువాత రెట్టింపు చేయడం పక్కన పెడితే వలంటీర్ వ్యవస్థనే తీసేశారు. ఏటా ఉగాది సమయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవారత్న పురస్కారాలతో గౌరవించేది. కూటమి ప్రభుత్వం వలంటీర్లను పూర్తిగా మోసం చేసింది.
– ఎస్.అనిల్, వలంటీర్, పార్వతీపురం పట్టణం
అంతన్నారు... ఇంతన్నారు...
ఎన్నికల ముందు కూటమి నేతలు అధికారంలోకి వస్తే అంత చేస్తాం.. ఇంతచేస్తాం అంటూ నమ్మించారు. అధికారం చేపట్టాక ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టాను. అన్నివర్గాల ప్రజలకు క్షోభ మిగిల్చారు. వలంటీర్ జీతంతో బతికే మాలాంటి కుటుంబాలకు అన్యాయం చేశారు. మా ఉసురు తప్పకుండా తగులుతుంది.
– సాయి గణేష్, వలంటీర్, పార్వతీపురం పట్టణం

మాటిచ్చి.. మాయచేశారు..!

మాటిచ్చి.. మాయచేశారు..!

మాటిచ్చి.. మాయచేశారు..!