
గొలుసు దొంగల ఆటకట్టు
● మూడు కేసుల్లో నలుగురు నిందితుల అరెస్ట్
ఎంవీపీకాలనీ:
నగరంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస గొలుసు దొంగతనాల కేసులను ద్వారకా క్రైం పోలీసులు ఛేదించారు. ఎంవీపీ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ద్వారకా క్రైం ఏసీపీ లక్ష్మణరావు ఆ వివరాలు వెల్లడించారు. నగరంలో వరుస దొంగతనాలు జరగడంతో క్రైం పోలీసు విభాగం అప్రమత్తమై త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
●శివాజీపాలెంలో శోభారాణి అనే మహిళ నుంచి 4 తులాల బంగారు గొలుసు అపహరించిన నిందితులకు తీవ్ర నేర చరిత్ర ఉన్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన నాగరాజు, ఇమ్రాన్‌లను ఈ కేసులో నిందితులుగా గుర్తించామని, ఇప్పటికే నాగరాజుపై 35, ఇమ్రాన్‌పై 25 పాత కేసులు నమోదైనట్లు చెప్పారు.
●మద్దిలపాలెం చైతన్యనగర్‌కు చెందిన హేమలత అనే మహిళ నుంచి బంగారు గాజులు, చైను లాక్కొని పరారైన నిందితుడు విజయనగరానికి చెందిన సిరిపురపు వెంకటరమణగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు క్రైం ఏసీపీ తెలిపారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించిన ఏసీపీ.. అతని నుంచి రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగిలించిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ.2,80,500కు నిందితుడు తాకట్టు పెట్టినట్లు వివరించారు. ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉందన్నారు.
●ఎంవీపీ కాలనీలో లలిత అనే 90 ఏళ్ల మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటనలో నిందితుడు రైల్వే న్యూ కాలనీకి చెందిన పిడుగు జగదీష్‌గా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.