
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు
పార్వతీపురం: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. పార్వతీపురం గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో 51 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, 70 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు ఒక యూనిట్‌గా ఏర్పడి 16 శాతం వృద్ధి సాధించాలన్నారు. ప్రాథమిక రంగాలైన వ్యవ సాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్య్స రంగాలపై రైతులు దృష్టిసారించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఉపాధిహామీ పథకం నిధులతో ఫారం పాండ్స్‌ను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధి నిధులతో పశుగ్రాసాన్ని పెంచి ఎకరాకు రూ.39వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించిన జిల్లాగా పార్వతీపురంను నీతిఅయోగ్ సంస్థ గుర్తించిందన్నారు. జీడీ, పసుపు, ఆయిల్‌పాం పంటలను మరింత విస్తరింపజేయాలన్నారు.
గిరిజనులకు బిందుసేద్యం యూనిట్లపై శతశాతం, ఇతరులకు 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. పార్వతీపురం, వీరఘట్టం, సాలూరు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయని, వాటిని అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేలా రైతు లకు అవగాహన కల్పించాలన్నారు. ఏనుగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, చింతపల్లి ప్రచురించిన ఉన్నత పర్వత శ్రేణి, గిరిజన ప్రాంతాల్లో వలిసెలసాగు సమగ్ర యాజమాన్యం బుక్‌లెట్‌ను విడుదల చేశారు. రైతులకు అవసరమైన సేంద్రియ ఎరువు, జీవన ఎరువుల ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో ఆచార్య ఎన్‌జీ రంగ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డా.ఎ.అప్పలస్వామి, అధికారులు డాక్టర్ జి.శివనారాయ ణ, బి.శ్యామల, జి.శ్రీనివాసరావు, షణ్ముఖ, కేవీకే శాస్త్రవేత్తలు, ఎన్‌జీఓలు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు