
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఏటీఎల్ సమ్మర్ బూట్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: వచ్చే నెల 1 నుంచి 3వ తేదీవరకు ధర్మవరం ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించనున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) బూట్ క్యాంప్ పోస్టర్‌ను డీఈఓ యూ.మాణిక్యనాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో అందించే శిక్షణ వివరాలపై జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాంపులో విద్యార్థులకు డిజైనింగ్, క్రిటికల్ థింకింగ్, డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్డినోకోడింగ్, రోబోటిక్ ఆటోమెషీన్ టెక్నాలజీలపై శిక్షణ ఇస్తామన్నారు. ఽకార్యక్రమంలో డీప్యూటీ ఈఓ కె.వెంకటరమణ, హబ్ ఏటీఎల్ ఇన్‌చార్జ్ వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని మిమ్స్ డ్రైవర్ మృతి
నెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో పాత రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని, మిమ్స్ డ్రైవర్ మృతి చెందాడు. మిమ్స్ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బి.సూర్యనారాయణ(45) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడి ట్రాక్ దాటుతుండగా విజయనగరం వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక అమ్మాయి ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అత్యుత్సాహమేనా..?
పార్వతీపురంటౌన్: ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ ఫొటోలతో పాటూ సీఎం, డివ్యూటీ సీఎం ఫొటోలు పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే పార్వతీపురం మున్సివల్ కార్యాలయం కమిషనర్ చాంబర్‌లో మాత్రం ఎమ్మెల్యే ఫొటోను పెట్టి అధికారి అయి ఉండి అత్యుత్సాహం చూపుతున్నారా..? అభిమానం చూపుతున్నారా అని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎమ్మెల్యే వద్ద సానుభూతి పొందేందుకే ఇలా చేస్తున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రయోజనకరం
● జేసీ సేతు మాధవన్
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మంగళవారం డ్రోన్ టెక్నాలజీపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతిక పెరుగుతోందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంలో ఖర్చులను తగ్గించడంలో సమర్థతను పెంచడంలో డ్రోన్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. కిసాన్ డ్రోన్ ఎఫ్‌ఎంబీ గ్రూపుల ఖాతాల ప్రారంభం, రుణమంజూరుకు సంబంధించి పక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి