
పాండవుల గుట్ట గుల్ల
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో 597 సర్వే నంబర్‌లో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాండవుల గుట్ట ఆక్రమణకు గురై ఆనవాళ్లు కోల్పోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అజ్ఞాత సమయంలో పాండవులు ఇక్కడ సేద తీరినందువల్లే పాండవుల గుట్టగా ఇక్కడి ప్రజలు చెప్పుకునే చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పాండవుల గుట్ట నేడు ఆక్రమణకు గురై కనుమరుగువుతోంది. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గుట్ట మట్టిని తవ్వి ఆ నేలను ఆక్రమిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గుట్టపై జగత్ మౌనీశ్వరాశ్రమం, సప్తదేవ కన్యలు, సప్తమాత్రుకలు, శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, నాగదేవత ఆలయాలు కొలువై ఉన్నాయి. వేద పాఠశాల నిర్వహణతో నిత్యం వేద పారాయణంతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోంది. ఇటీవల ఇదే ప్రాంత్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణంతో భజనలు, కీర్తనలతో ఈప్రాంతం అలరారుతోంది. ఈ ఆలయాలకు వెనుక వైపు భాగం ఆక్రమణకు గురవుతుండటంతో ఈ గుట్ట మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.
ఆవాసం, మేత కరువు..
ఈగుట్టపై నెమళ్లు, కుందేళ్లు, చెట్లపై రకరకాల పక్షులు నివాసముండేవి. గుట్ట మట్టితో పాటు చెట్లను నరికివేయడంతో పక్షులు, వన్యప్రాణులు కనుమరుగుతున్నాయి. చెట్లు నరికి వేస్తుండటంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికై నా ఆక్రమణకు గురికాకుండా అడ్డుకుంటేనే పశుపక్షాదులు, వన్యప్రాణుల రక్షణ సాధ్యమవుతుంది.
ఆక్రమిస్తూ.. మట్టి తరలిస్తూ
సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
చారిత్రక నేపథ్యం ప్రశ్నార్థకం
పశుపక్షాదులు, వన్యప్రాణులకు మేత, ఆవాసం కరువు