రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ గురువారం రోజున సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. ఇకపై పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడితే 10 కోట్లు జరిమానాతో పాటు జీవిత కాలం జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది.
ఏమిటీ బిల్లు..
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాంగిర్ అలాం ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిపై సుదీర్ఘంగా చర్చ కూడా సాగింది. ఇకపై ఎవరైనా పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే వారికి 10 కోట్లు జరిమానా తోపాటు జీవితకాలం ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేయడాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తూ నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.
అనర్హులకు చెక్..
ఆయా నియామకాలకు సంబంధించి జరిగే కాంపిటీటివ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ద్వారా పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేసేవారికి కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది. ఇంతకాలం పరీక్షల నిర్వహణలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లొసుగులను సద్వినియోగం చేసుకుంటూ గతంలో కొందరు అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారని, అందుకే ఈ తరహా కఠిన చట్టాలను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. మరోపక్క బీజేపీ పార్టీ ఎప్పటిలాగే దీన్నొక క్రూరమైన చట్టంగా వర్ణించింది.
సీఎం కామెంట్..
దీనిపై స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ఎలా తయారు చేస్తోందో అందరూ చూస్తున్నారని.. ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి కాదని, మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే జైలు శిక్షను కూడా కుదిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాదిపాటు.. రెండోసారి పట్టుబడితే మూడేళ్లపాటు ఉండేలా సవరణలు చేశారు.
ఇది కూడా చదవండి: విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
Comments
Please login to add a commentAdd a comment