ఫలితాలు వచ్చిన 4 గంటల్లోనే రాప్తాడులో 27 దాడులు జరిగాయి
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
కార్యకర్తల్లో ధైర్యం నింపుతాం: మాజీ ఎంపీ మాధవ్
అనంతపురం కార్పొరేషన్: ప్రాణాలు అడ్డువేసైనా టీడీపీ దాడుల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 గంటల్లోనే రాప్తాడులో 27 అవాంఛనీయ ఘటనలు జరిగాయని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. కనగానపల్లి మండలంలోని 7 గ్రామాల్లో, రామగిరిలో 6 గ్రామాల్లో, చెన్నేకొత్తపల్లిలో 7 గ్రామాల్లో, ఆత్మకూరులో 5 ప్రాంతాల్లో, రాప్తాడులో రెండోచోట్ల వైఎస్సార్ïÜపీ శ్రేణులు, వారి ఆస్తులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు.
చాలామందికి తీవ్ర గాయాలై ఆస్పత్రుల పాలయ్యారని చెప్పారు. గొరిదిండ్లలో వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చారన్నారు. ఎస్కేయూలోనూ వైఎస్సార్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని అన్నారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిపైనా తమ నాయకులు, కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడలేదని తెలిపారు. ఎవరెంతగా రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు చెప్పామని, అది వైఎస్సార్‌సీపీ నైజమన్నారు.
పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆ పార్టీ పెద్దలు నోరుమెదపడం లేదన్నారు. పోలీసు వ్యవస్థను నమ్ముదామని, వారు స్పందించకుంటే కోర్టులను ఆశ్రయిద్దామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి, మంచి చేస్తే స్వాగతిద్దామన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారా? ఉద్యోగులకు ఐఆర్, పీఆర్‌సీ ఇస్తారా? సీపీఎస్ రద్దు చేస్తారా? 20 లక్షల ఉద్యోగాలిస్తారా అని ప్రశ్నించారు.
తాలిబన్ల తరహాలో దాడులు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు తాలిబన్ల తరహాలో దాడులకు పాల్పడుతున్నారన్నారు. తమ ప్రాణాలను అడ్డు వేసైనా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. దాడులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిలో మనోధైర్యాన్ని నింపుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment