కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార తృణమూల్ పార్టీని దెబ్బకొట్టి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన మంత్రి సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇక ఈరోజు మరో ఎమ్మెల్యే శిల్‌భద్ర దత్తా సహా మైనార్టీ సెల్ నాయకుడు కాబిరుల్ ఇస్లాం టీఎంసీని వీడారు.
అదే విధంగా 24 గంటల్లోనే నలుగురు ముఖ్యనేతలు పార్టీని వీడటం, రానున్న రోజుల్లో భారీ ఎత్తున క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీఎంసీ మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారి సహా ఆయన అనుచరుడు, దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చీఫ్, గ్రీవెన్స్ సెల్ హెడ్ కల్నల్ దీప్తాంశు చౌదరి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌కు లేఖ పంపించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వారంతంలో బెంగాల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వీరంతా అప్పుడే కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు టీఎంసీలో కలవరం రేపుతున్నాయి.(చదవండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం)
మమతకు వరుస షాకులు.. గవర్నర్ నిర్ణయం
టీఎంసీ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే సువేందు అధికారి రాజీనామాను స్పీకర్ అంగీకరించలేదు. ఈనెల 21న ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయనకు సందేశం పంపారు. ఇదిలా ఉండగా.. బారక్‌పోర్ నుంచి గెలుపొందిన శిల్‌భద్ర దత్తా మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీని వీడుతున్నట్లు మమతకు రాసిన లేఖలో.. ‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేనని నాకు అనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. అయినా నేనెందుకు రాజీనామా చేయాలి? ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. నేను పదవిలో లేనట్లయితే వాళ్లు ఎవరిని ఆశ్రయిస్తారు. కేవలం పార్టీని మాత్రమే వీడుతున్నాను’’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనలాంటి రెబల్స్‌ను బుజ్జగించేందుకు టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ లేదా ఆయన టీం రంగంలోకి దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సెటైర్లు వేసిన బీజేపీ ఐటీ సెల్
ముకుల్ రాయ్ సహకారంతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మమత సర్కారును విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మాటల దాడి చేస్తోంది. ఇక బీజేపీ సోషల్ మీడియా వింగ్ సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై స్పందించిన బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ.. ‘‘ఈస్థాయిలో టీఎంసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారంటే.. ఆంటీ తన కార్యాలయంలో రాజీనామా లేఖలు కలెక్ట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ సెంటర్ పెడితే సరిపోతుంది’’అంటూ ట్విటర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ ప్రాంతంపై అధికారికి పట్టు!
ఓవైపు టీఎంసీ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతుండగా.. మరోవైపు బీజేపీ ఆ పార్టీ ముఖ్యనేతలకు గాలం వేస్తూ రోజురోజుకీ బలం పెంచుకుంటోంది. సువేందు అధికారి బీజేపీలో చేరడం లాంఛనమే అని పార్టీ వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే. కాగా అధికారిని చేర్చుకోవడం వల్ల కాషాయ దళానికి భారీగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంపై ఆయనకు పట్టు ఉంది. సుమారు 50 సీట్లలో పార్టీని గెలిపించే సత్తా ఆయనకు ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఈ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
ఇక బీజేపీ తీరుపై ఇటీవలి కూచ్‌బెహర్ పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారని మండిపడ్డారు. అదే విధంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘‘కొంతమంది అలల్లాగా వస్తారు పోతారు. కానీ టీఎంసీ ఉనికిని ఎవరూ ఎన్నటికీ మాయం చేయలేరు’’ అని చెప్పుకొచ్చారు. కాగా పశ్చిమబెంగాల్‌లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ క్రమంగా పట్టుబిగిస్తోంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల డేటాని బట్టి చూసినా కామ్రేడ్ల స్థానాన్ని కాషాయం ఆక్రమిస్తున్న విషయం దృఢపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment