
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, పైగా బారికేడ్లు తొలగించి వారికి సహకరించారంటూ ఆరోపణలు గుప్పించింది. కాగా బీజేపీకి చెందిన మేయర్లు, ముఖ్య నేతలను హతమార్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆ పార్టీ నాయకులు సిసోడియా ఇంటి ముందు నిరవధిక ధర్నాకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్లకు బాకీ పడ్డ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. (చదవండి: ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లే కొడతారు: మంత్రి)
ఈ నేపథ్యంలో ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ గూండాలు డిప్యూటీ సీఎం ఇంట్లో లేని సమయంలో దాడికి తెగబడ్డారు. ఢిల్లీ పోలీసులు వారికి సహకరించారు’’ అని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అశోక్ గోయల్ దేవ్రా ఆప్ ఆరోపణలను ఖండించారు. తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపారని పేర్కొన్నారు. హత్య కుట్ర నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అధికార పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాఠక్‌తో బీజేపీ నేతలకు ప్రాణహాని ఉందంటూ ఆ పార్టీ నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆడియోలు పోలీసులకు సమర్పించగా.. ఇవన్నీ కల్పితాలంటూ పాఠక్ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment