
కలకత్తా: పశ్చిమబెంగాల్‌లో వేసవితో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందంపై తూర్పు మిడ్నపూర్‌లో స్థానికులు దాడి చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం(ఏప్రిల్ 7)న జల్పాయ్‌గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎన్‌ఏఐ బృందంపై దాడి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పనేనని ఆరోపించారు.
తృణమూల్ నేతలకు రాజ్యాంగం, శాంతిభద్రతలు ఏవీ పట్టవని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్వయానా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఎన్‌ఐఏ ఉన్నతాధికారులను బీజేపీ నేతలు వెళ్లి కలిసిన తర్వాతే తమ పార్టీ నేతలకు బాంబు పేలుడు కేసులో నోటీసులు వచ్చాయని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
అవసరమైతే బీజేపీ నేతలు ఎన్‌ఐఏ పోలీసు అధికారులను కలిసిన వీడియో కూడా విడుదల చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు ఎన్‌ఐతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎన్‌ఐఏ స్పందించింది. అభిషేక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది.
ఇదీ చదవండి.. తిరువనంతపురం ఫైట్.. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment