ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను(బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్.
అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్‌సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Comments
Please login to add a commentAdd a comment