సోమవారం కోస్గి సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రియాంకా గాంధీ, రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, యాదాద్రి: ‘తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కొట్లాడి, చెమట, రక్తం చుక్కలు చిందించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వేలాది మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు ఏం చేసింది? కేసీఆర్ ప్రభుత్వంలో కలలు సాకారం కాలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ ఈ ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు రాలేదు. ఈ ఎన్నికల సమయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది. ప్రజాభవన్ నుంచి పాలన చేస్తాం. కేంద్రంలోని నరేంద్రమోదీ దేశసంపదను అదానీ, అంబానీకి ధారాదత్తం చేస్తోంటే.. తెలంగాణలో ఉన్న కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబానికి దోచి పెడుతున్నారు..’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. సోమవారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, కోస్గిల్లో ప్రజాభేరి బహిరంగ సభల్లో, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు.
సోనియా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు
‘నా తల్లి సోనియాగాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నా తల్లి నెరవేర్చారు. ఈ దేశం కోసం నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు. తెలంగాణలో ప్రాణత్యాగం చేసిన వారి ఉద్యమ స్ఫూర్తి వృధా పోకూడదు.
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమైనా చేస్తారని అనుకున్నాం. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా చేసిందేమీ లేదు. ప్రజల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టూ సంపూర్ణంగా పూర్తి కాలేదు..’ అని ప్రియాంక విమర్శించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటే
‘బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు మద్దతు ఇస్తుంది. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో, బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అన్నదమ్ముల పాలన సాగిస్తూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఎంఐఎం పార్టీ వాటికి చిన్న తమ్ముడిలా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. రాహుల్‌గాంధీ మీద ఒవైసీ అనవసర ఆరోపణలు చేస్తుంటారు.
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక శక్తిగా ఎదిగారు. దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు రాహుల్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే వత్తాసు పలుకుతోంది. ప్రధాని మోదీ ఈ దేశ ఆస్తులను పెద్ద కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారు. అదానీ ఒక్క రోజులో రూ.1,600 కోట్లు సంపాదిస్తుంటే.. రైతు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడు..’ అని మండిపడ్డారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేశాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణితో లాక్కున్న భూములను తిరిగి మీకు ఇప్పిస్తాం. ఇళ్లు కట్టుకునే వారికి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం చేస్తాం. రాజస్తాన్‌లో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగాన్ని తగ్గించాం.
బీఆర్‌ఎస్ హయాంలో ఇక్కడ మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరి 2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అవినీతిని పారదోలతాం. తెలంగాణ అమరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతాం. ఆదివాసీలకు భూ పట్టాలిస్తాం..’ అని ప్రియాంక హామీ ఇచ్చారు.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
‘ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో గత పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు పాలించడానికి ఎవరిని ఎన్నుకోవాలి.. మీ జీవితాలు ఎలా బాగుచేసుకోవాలి అనే విషయాన్ని మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? మోసం చేసే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోండి..’ అని ప్రియాంక అన్నారు.
‘మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా, లిక్కర్ మాఫియా వస్తుంది. మీకు ఉద్యోగాలు రావు. ప్రశ్నపత్రాలు లీక్ ఆవుతాయి. అవినీతి ఆకాశన్నంటుతుంది. అప్పు పదింతలవుతుంది..’ అని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్, కొడంగల్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు అండగా ఉన్నంత వరకు ఇటు రాష్ట్రంలో కేసీఆర్, అటు దేశంలో మోదీ మెడలు వంచే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా..’ అని అన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, అభ్యర్థులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), సరిత (గద్వాల) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment