సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ కర్ణాటక తరహా ఫలితం వెలువడేలా చేయా లని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహానికి పదును పెట్టే క్రమంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల నేతలతో చర్చించేందుకు సమాయత్తమైంది. దీనిలో భాగంగా 26న ఢిల్లీకి రావాల్సిందిగా టీపీసీసీ ముఖ్య నేతలకు ఆహ్వానం పంపినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
నివేదికల ఆధారంగా కీలక సూచనలు!
ఐదు రాష్ట్రాల నేతలతో జరిగే భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో నేతల మధ్య భేదాభిప్రాయాలు, ఐక్యతా యత్నాలు, ఎన్నికల వ్యూహాలు, సంస్థాగతంగా బలోపేతంపై చర్చించనున్నారు.
రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలకు సంబంధించి నేతల ఐక్యతకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ముఖ్య నేతలకు విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. పీసీసీ కమిటీలు మొదలు, కొన్ని నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థుల ప్రకటన వంటి అంశాల్లో రేవంత్ తీరుపై కొందరు గుర్రుగా ఉన్నారు. పీసీసీ నిర్వహించే కార్యక్రమాలకు ఓ వర్గం నేతలు దూరంగా ఉంటుంటే, సీఎల్పీ నేత నిర్వహిస్తున్న బహిరంగ సభలకు మరోవర్గం నేతలు దూరంగా ఉంటున్నారు.
సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యంగా మారింది. వీటన్నింటిపై ఏఐసీసీ ఇప్పటికే రాష్ట్ర ఇన్‌చార్జిల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఎన్నికల సమయంలో నేతల మధ్య ఐక్యత ముఖ్యమని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆయా నివేదికల ఆధారంగా నేతలకు కీలక సూచనలు చేసే అవకాశాలున్నాయి.
బీఆర్‌ఎస్‌పై పోరాటానికి పక్కా వ్యూహం: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దోహదపడిన ‘కమీషన్ల ప్రభుత్వం’నినాదాన్ని తెలంగాణలోనూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇక 111 జీవో రద్దు, రింగ్‌రోడ్డు, సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ప్రధానాస్త్రంగా చేసుకొని బీఆర్‌ఎస్‌పై పోరాడేలా పక్కా వ్యూహాన్ని హైకమాండ్ సిద్ధం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ఏజెన్సీలను సంప్రదించడం, కోర్టుల్లో దావాలు వేయడం సహా ప్రజా పోరాటాలు నిర్మించే అంశంపై మార్గదర్శనం చేయనుంది. దీంతో పాటే పార్టీ ఇప్పటికే ప్రకటిస్తున్న హామీల అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రియాంకాగాంధీ పర్యటనల అంశాలను 26న జరిగే భేటీలో చర్చిస్తారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
జడ్చర్ల సభ ముగించుకుని..
ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో ఈనెల 25న జడ్చర్లలో భారీ సభ మరుసటి రోజే టీపీసీసీ ముఖ్య నేతలంతా ఢిల్లీ పయనమవుతున్నారు. 11 మంది కీలక నాయకులతో ఖర్గే, రాహుల్‌గాంధీలు సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ముగ్గురు ఎంపీలు), మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క (ఐదుగురు ఎమ్మెల్యేలు), జీవన్‌రెడ్డి (ఎమ్మెల్సీ), మధుయాష్కీ గౌడ్ (టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్), దామోదర రాజనర్సింహ (టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్)లకు ఆహా్వనం అందింది. కాగా ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment