‘మిషన్‌–ముంబై’ ఘరూ | All parties Strategizing For Mumbai Municipal Corporation Elections | Sakshi
Sakshi News home page

‘మిషన్‌–ముంబై’ ఘరూ

Published Sat, Jan 9 2021 10:55 AM | Last Updated on Sat, Jan 9 2021 11:27 AM

All parties Strategizing For Mumbai Municipal Corporation Elections - Sakshi

సాక్షి, ముంబై: జనవరి చివర లేదా ఫిబ్రవరిలో మొదటి వారంలో జరగనున్న ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ‘మిషన్‌–ముంబై’ పేరుతో మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నా యి. రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రికరించిన పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలని బలోపేతం చేయడంతో పాటు ప్రజాదారణ పొందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. అదే విధంగా కొన్ని పార్టీలైతే అంతర్గత విబేధాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్‌ ఆఘాడి (ఎంవీఏ) ప్రభు త్వం కొనసాగుతోంది. దీంతో ఇటీవలే జరిగిన విధాన మండలి ఎన్నికల్లో మహావికాస్‌ ఆఘాడిలోని పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు కూడా వీరికి అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాబోయే ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నిక లు రసవత్తరం గా మారనున్నా యని చెప్ప వచ్చు. ముంబై  లో శివసేన, బీజేపీలు కలిసి పోటీ చేయడం తో పాటు అనేక ఏళ్లుగా ముంబై కార్పొరేషన్‌లో శివసేన అధికారంలో ఉంది. మేయర్‌ శివసేన అభ్యర్థి ఉండగా డిప్యూటీ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. చదవండి: (నిన్ను చంపేస్తాం..)

ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన మహావికాస్‌ ఆఘాడిని ముఖ్యంగా శివసేనకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరోవైపు పట్టును నిలుపుకోవాలని సేన భావిస్తుండగా తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు పనిచేస్తున్నాయి. మహావికాస్‌ ఆఘాడి లో ఔరంగాబాద్‌ పేరును సంభాజీనగర్‌గా మార్చే అంశంపై రగడ కొనసాగుతోంది. పేరును మార్చేందుకు శివసేన భావిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ముంబై మున్సిపల్‌ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తా  యా లేదా అనేది చూడాల్సిందే. 

ఎన్సీపీ
ముంబై మున్సిపల్‌ కార్పొరేన్‌ ఎన్నికల కోసం ఎన్సీపీ కూడా అన్ని విధాల సిద్ధమవుతోంది. వీలైతే మహావికాస్‌ ఆఘాడిగా కలిసి పోటీ చేయాలని లేదంటే ఒంటరి పోరుకు కూడా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు సంకేతాలిస్తోందని, తాము కూడా ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎ లాంటి స్పష్టత రాలేదు.  చదవండి: (జలేబీ ఫాఫడా.. ఉద్ధవ్‌ ఆపడా!)

బీజేపీ... 
2022లో జరగబోయే ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అంతర్గత విబేదాలకు తావులేకుండా జాగ్రత్తపడుతోంది. ఇటీవలే ముంబైలో బీజేపీ కోర్‌ కమిటి సమావేశం నిర్వహించింది. ఇందులో గ్రామ పంచాయితీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తమ బలాన్ని పెంచుకోవడం కోసం పలువురు నేతలకు బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు ముంబైలో ఈసారి అధికారం మాదే అంటూ దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటిస్తూ వస్తున్నారు.  

శివసేన.. 
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రికరించిన శివసేన కూడా మిషన్‌–ముంబై కోసం పావులు కదుపుతోంది. ముఖ్యంగా పేరు మార్పు అంశంపై కాంగ్రెస్, శివసేనల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్న ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 10వ తేదీన గుజరాతి సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకోసం ‘ముంబై మా జలేజీ ఫాఫడా.. ఉదవ్‌ ఠాక్రే ఆపడా..’ అనే నినాదంతో గుజరాతీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ బాధ్యతలను శివసేన పదాధికారి హేమరాజ్‌ షాకు అప్పగించారు.  

కాంగ్రెస్‌... 
మిషన్‌–ముంబై కోసం కాంగ్రెస్‌ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఔరంగాబాదు పేరు మార్పు అంశంపై విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్‌ నాయకులు బాలాసాహెబ్‌ థోరాత్‌తోపాటు భాయి జగ్తాప్‌లు ఇప్పటికే పలుమార్లు ముంబైలో తాము ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు చెబుతూ వస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల కోసం అన్ని విధాల సిద్ధంగా ఉండాలంటూ అన్ని ప్రయాత్నాలను కాంగ్రెస్‌ ప్రారంభించింది.  

కొత్త సమీకరణాలు..
ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు కలిసికట్టుగా పోటీ చేసిన శివసేన, బీజేపీలు రాబోయే ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయనున్నారు. మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిఇలాఉండగా మరోవైపు ఈ మూడు పార్టీలు కలిస్తే వీరిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌)తో బీజేపీ చేతులు కలిపే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే స్థానికుల అంశంపై ఎమ్మెన్నెస్‌ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై పట్టుసడలిస్తే వీడితే ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వీరిద్దరు ఒక్కటవుతారా లేదా అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయా అనేది వేచి చూడాల్సిందే.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement