సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి జూమ్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు హైదరాబాద్ నుంచి కదలరు.. జూమ్ వదలరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఏపీలో నివాసులు కారు, ఆంధ్రప్రదేశ్‌కు వారు ప్రవాసులని చెప్పారు. చంద్రబాబు ‘జూమ్ బాబు’ అయితే, చినబాబు ‘ట్విట్టర్ మాలోకం’ అని విమర్శించారు. బాబును ఏపీ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారన్నారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రజల్లో లేని ప్రతిపక్షం ఆ మీడియాలో మాత్రమే కనిపిస్తుందని.. ఏపీలో ప్రతిపక్షం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► టీడీపీ.. విఫలమైన ప్రతిపక్షం.. ప్రజలు మర్చిపోయిన ప్రతిపక్షం.. ప్రజలకు దూరమైన ప్రతిపక్షం. అయినా బాబు తనకున్న రెండు పత్రికలు, మూడు ఛానెళ్ల మద్దతుతో రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంకా ఉన్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారు. ఠి బాబుకు ధైర్యం ఉంటే ఇక్కడకు వచ్చి.. ప్రజల మధ్య నిలబడి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి.
► చంద్రబాబు కాకుండా ఇంకెవరైనా ఈ సమయంలో హైదరాబాద్‌లో ఉండి జూమ్‌లో మాట్లాడితే ఇవే ఎల్లో మీడియా, పత్రికలు ఏ విధంగా రాతలు రాసేవో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.
► కాబట్టి.. ఓ వర్గం మీడియా పత్రికల్లో మాత్రమే ప్రతిపక్షం ఉంది తప్ప ప్రజల్లో లేనేలేదు.
► ఈ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద బురద చల్లడం చేస్తున్నారు.
► ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయి.
► రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఆదా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దళిత పక్షపాత ప్రభుత్వం. కానీ, బాబు దళిత ద్రోహి, టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ.
► ఎమ్మెల్యేగా ఉంటూ నేను అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నానని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఏ విచారణకైనా సిద్ధం.
► అక్రమ మైనింగ్ దొంగలే, బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆరోపణలు చేస్తున్నారు.
► కోర్టులో పిల్ వేసిన వారిలో ఒకరు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైతే మరొకరు టీడీపీ వ్యక్తి.
టీడీపీ.. ప్రజల్లో లేని ప్రతిపక్షం
Published Tue, Sep 1 2020 4:18 AM | Last Updated on Tue, Sep 1 2020 7:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment