నిమ్మగడ్డ సమావేశానికి వైఎస్సార్‌సీపీ వెళ్లదు | Ambati Rambabu Comments On Nimmagadda Ramesh Kumar | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ సమావేశానికి వైఎస్సార్‌సీపీ వెళ్లదు

Published Wed, Oct 28 2020 3:13 AM | Last Updated on Wed, Oct 28 2020 4:05 AM

Ambati Rambabu Comments On Nimmagadda Ramesh Kumar - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నందుకే ఆయన నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల సమావేశానికి వైఎస్సార్‌సీపీ వెళ్లడం లేదని ఆ పార్టీ ప్రకటించింది. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చదువుకుని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తే బాగుండేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఒకసారి ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రభుత్వ అభిప్రాయం అక్కర లేదా?
– రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా, ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? చీఫ్‌ సెక్రటరీ, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ముందు రాజకీయ పార్టీలను పిలవటంలోనే ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లటం సరికాదని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేస్తోంది. 
– స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల మీద చర్చ అంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో రాజకీయానికి తెరతీశారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే.. ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీతో, మొత్తంగా ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలి. 
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా, ఒన్‌ టు ఒన్‌ సమావేశానికి రండంటూ రాజకీయ పార్టీలను పిలవడం కచ్చితంగా చంద్రబాబు రాజకీయంలో భాగమే.  
– రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండానే రాష్ట్రంలో ఉనికే లేని, పోటీలో లేని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను నిమ్మగడ్డ పిలిచారంటే దీని మర్మం ఏంటో మరో 24 గంటల్లోనే అందరికీ తెలుస్తుంది. 

నాడు ఎవరిని అడిగి వాయిదా వేశారు?
– రాష్ట్రంలో 3 కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ చెప్పాలి. ఇప్పుడు దాదాపు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవచ్చా? 
– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వందకు వంద శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లలో విజయం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసం మాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంది.  
– ఎన్నికల నిర్వహణ అంటే.. ఓటువేసే ఓటరు భద్రతను అంటే 3 కోట్ల ప్రజల భద్రతను, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే టీచర్లు, ఇతర ఉద్యోగ సోదర, సోదరీమణులు, పోలీసుల వరకూ ప్రతి ఒక్కరి భద్రతకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాధ్యత వహిస్తారా?

ఎన్నికలంటే డ్రామా అనుకుంటున్నారు..
– నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల వాయిదా తర్వాత 2 ఉత్తరాలు రాశారు. అందులో 2వ ఉత్తరంలో వైఎస్సార్‌సీపీ మీద, మా పార్టీ అధ్యక్షుడి మీద అత్యంత తీవ్రమైన దిగజారుడు పద్దతుల్లో వాడకూడని పదజాలాన్ని వాడి ఆరోపణలు చేశారు. 
– తనకు ప్రాణభయం ఉందని, మా పార్టీది ఫ్యాక్షనిస్ట్‌ ధోరణి అని, గూండాలమని, సంఘ వ్యతిరేక శక్తులు అంటూ లేఖలు రాసిన చరిత్ర నిమ్మగడ్డ రమేశ్‌ది. అధికార పార్టీ మీద ఇంత తీవ్రమైన అంసంతృప్తి, పక్షపాతం, అసహనం, ద్వేషం, వ్యతిరేక ఎజెండా ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక్కో పార్టీకి 10 నిమిషాలు అంటూ ఏకపక్షంగా అజెండాతో సమావేశం పెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ తిరస్కరిస్తోంది. 
– హైదరాబాద్‌లో ఎవరూ గుర్తు పట్టకుండా స్టార్‌ హోటళ్లలో చీకటి సమావేశాలు జరిపే వ్యక్తిగా మాత్రమే ఆయన రాష్ట్ర ప్రజలకు గుర్తున్నారని వైఎస్సార్‌సీపీ మరోసారి స్పష్టం చేస్తోంది. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement