బాబు నిర్వాకంతో రూ.2,020 కోట్లు నష్టం  | Ambati Rambabu comments over chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబు నిర్వాకంతో రూ.2,020 కోట్లు నష్టం 

Published Mon, Jun 12 2023 2:55 AM | Last Updated on Mon, Jun 12 2023 2:55 AM

Ambati Rambabu comments over chandrababu naidu - Sakshi

సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యంతో పనులు చేపట్టడంతోపాటు పోలవరం నిర్మాణంలో జాప్యం, భారీ నష్టానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో ప్రోటోకాల్‌ ప్రకారం వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయకుండా కమీషన్ల దాహంతో ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను చంద్రబాబు చేపట్టారని విమర్శించారు.

కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయకుండా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బ తినడంతోపాటు ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం కోతకు గురై అగాధాలతో ధ్వంసమైందన్నారు. డయాఫ్రమ్‌వాల్‌లో దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి, అగాధాలను పూడ్చివేసి ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చేందుకు రూ.2,020 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు.

ఈ నష్టానికి చంద్రబాబు, దేవినేని ఉమా, నవయుగ కారణమని స్పష్టం చేశారు. నవయుగ సంస్థ రామోజీ కుమారుడి వియ్యంకుడిది కావడంతో ఈ నష్టం ఈనాడుకు కనపడదని వ్యాఖ్యానించారు. కమీషన్ల దాహంతో మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట? అని చంద్రబాబు, ఎల్లో మీడియాను నిలదీశారు.

ప్రచార పిచ్చితో ఆర్నెల్ల క్రితం పోలవరాన్ని పరిశీలిస్తానంటూ రాత్రి పూట చంద్రబాబు రాద్ధాంతం చేస్తే మాజీ మంత్రి దేనినేని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా వీరంగం సృష్టించారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ శరవేగంగా పూర్తిచేస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటే అనుమతి కోరితే ఇస్తామని  చెప్పారు. మంత్రి అంబటి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

పూర్తవుతుండటం కానరాదా? 
సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానళ్లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీ. పొడవున 2021 జూన్‌ 11నే మళ్లించారని మంత్రి అంబటి గుర్తు చేశారు. దిగువ కాఫర్‌ డ్యామ్, గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ను పూర్తి చేశామన్నారు. విద్యుత్కేంద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజై­న్ల ప్రకారం ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అ­గా­ధాల పూడ్చివేత వేగంగా సాగుతోందన్నారు. అది పూర్తయ్యాక డయాఫ్రమ్‌ వేసి వరదల్లోనూ ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పోలవరం పనుల్లోపురోగతే లేదంటూ చంద్రబాబు, ఎల్లో మీడి­యా దు్రష్ఫచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  

కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెస్తున్న సీఎం జగన్‌ 
2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో పోలవరం పూర్తి చేస్తానంటూ కేంద్రంతో చేసుకున్న ఒప్పందంపై 2016లో చంద్రబాబు సంతకం చేశారని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 48 శాతం పూర్తయ్యాయని, వ్యయం మాత్రం రూ.20,398 కోట్ల కంటే ఎక్కువ అయ్యిందన్నారు. చంద్రబాబు కమీషన్ల దాహంతో 2013–14 ధరలకే పనులు చేస్తానని అంగీకరించడం వల్ల 2017–18 ధరల ప్రకారం పోలవరానికి ఇవ్వాల్సిన రూ.55,548 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదన్నారు.

2017–18 ధరల ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం జగన్‌ పలుదఫాలు ప్రధాని మోదీ, జల్‌ శక్తి, ఆరి్థక శాఖల మంత్రులను కోరారని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం తొలుత 41.15 మీటర్ల పరిధిలో పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911 కోట్లు విడుదలకు అంగీకరించిందన్నారు.

ఇటీవల నిర్వహించిన లైడార్‌ సర్వేలో 41.15 మీటర్ల పరిధిలోకి మరో 36 గ్రామాల్లోని 16 వేల నిర్వాసిత కుటుంబాలు వస్తాయని తేలిందని, వారికి పునరావాసం కలి్పంచేందుకు రూ.5,127 కోట్లను అదనంగా ఇవ్వడానికి కూడా కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. నిధుల సమస్యను పరిష్కరించిన సీఎం జగన్‌ పోలవరాన్ని సందర్శించి శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయడాన్ని చూసి ఓర్వలేని ఈనాడు రామోజీరావు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గైడ్‌ బండ్‌ కుంగలేదన్నారు. కొంత జారిందని, కారణాలపై సీడబ్ల్యూసీ కమిటీ అన్వేííÙస్తుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా దాన్ని చక్కదిద్దుతామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ స్వప్నం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేది సీఎం వైఎస్‌ జగనేనని స్పష్టం చేశారు.  

 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్‌ బాబూ? 
చంద్రబాబుకు మతిభ్రమించి సీఎం జగన్, మంత్రులపై విమర్శలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ‘సీఎంగా 14 ఏళ్లు పనిచేసి కుప్పాన్ని మున్సిపాలిటీగా చేశావా? కనీసం రెవెన్యూ డివిజన్‌గా కూడా ఎందుకు చేయలేకపోయావ్‌?’ అని చంద్రబాబును నిలదీశారు. కుప్పం కాలువను కూడా పూర్తిచేయలేని దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుదన్నారు.

కుప్పంలో ఎలాంటి అభివృద్ధీ చేయని చంద్రబాబుకు మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? అని నిలదీశారు. ఐదేళ్లలో పులివెందులను దివంగత వైఎస్సార్‌ ఎలా అభివృద్ధి చేశారో వెళ్లి చూడాలని సలహా ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌కు విశ్వాసపాత్రుడిగా ఉంటూ టికెట్‌ తెచ్చుకుని సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా అంబటి చెప్పారు. చంద్రబాబు, పవన్‌ పార్టీలు మారిన వస్తాదులను ఎంత మందిని పోటీకి పెట్టినా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement