సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో అవరోధాలు, జాప్యానికి ముమ్మాటికీ చంద్రబాబు నిర్వాకాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. బాబు కమీషన్ల దాహం, అవగాహనరాహిత్యం వల్లే డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయిందని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ, మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ‘శాసనసభలో చర్చిద్దామా? లేదంటే మరో ప్రదేశం చెబుతావా? మంత్రి హోదాలో మీ ఇంటికి వచ్చేందుకు కూడా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. ‘మీరు చేసిన తప్పులు, పాపాలు మాపై నెడుతూ దస్తావేజులు మాదిరిగా లేఖలు రాయడం సమంజసమేనా?’ అని నిలదీశారు. మంత్రి అంబటి గురువారం రాత్రి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆ లేఖ కుట్ర పూరితం..
సీఎం జగన్‌పై బురద చల్లుతూ పోలవరంపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు దురుద్దేశపూరితంగా రాసిన లేఖను చెత్తబుట్టలో పారేయటం ఖాయం. రాజకీయ దురుద్దేశాలే మినహా పోలవరం పూర్తి కావాలనే చిత్తశుద్ధి బాబుకు లేదు. చంద్రబాబు ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించి నవయుగకు పనులు అప్పగించడానికి అంగీకరించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ).. మేం నవయుగను తప్పించి మేఘాకు అప్పగిస్తే ఒప్పుకోదా? కాంట్రాక్టర్‌ను మార్చవద్దని 2018లో పీపీఏ సూచించిన సంగతి చంద్రబాబుకు తెలియదా? వైఎస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం జగన్ శ్రమిస్తుంటే అవరోధాలు సృష్టిస్తున్నారంటూ లేఖలో చంద్రబాబు విషం కక్కారు. ఆ లేఖ షెకావత్‌కు చేరకముందే ఎల్లో పత్రికల్లో ప్రచురించారు.
పునరావాసం కల్పించకుండా..
గోదావరి ప్రవాహాన్ని మళ్లించే స్పిల్‌వేను పునాది దశలోనే వదిలేసిన చంద్రబాబు కమీషన్ల దాహంతో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. అంతకుముందే రూ.400 కోట్ల వ్యయమయ్యే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎగువ కాఫర్ డ్యామ్‌లో కుడి వైపు, ఎడమ వైపు రెండు చోట్ల ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. ఆ ఖాళీ ప్రదేశాల ద్వారా గోదావరి వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎగువ కాఫర్ డ్యామ్ కట్టకపోయినా.. పూర్తి చేసి ఉన్నా డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయే అవకాశమే ఉండేది కాదు. పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా నాడు చంద్రబాబు, దేవినేని ఉమా సవాల్ విసిరారు. జల్ శక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలో తమ హయాంలో 71 శాతం పూర్తి చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. స్పిల్ వేను పునాది దశలోనే చంద్రబాబు వదిలేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను మధ్యలో వదిలేశారు.
నేడు చిత్తశుద్ధితో పనులు..
సీఎం జగన్ అధికారం చేపట్టగానే నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. స్పిల్‌వే, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తున్నాం. కొట్టుకుపోయిన డయాఫ్రమ్‌వాల్ పరిస్థితిని అంచనా వేయడానికి, సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా నిపుణులను సంప్రదిస్తున్నాం. ఎన్‌హెచ్‌పీసీ బృందం కూడా ఇటీవల పోలవరాన్ని సందర్శించింది. ఈసీఆర్‌ఎఫ్‌ను పూర్తి చేసి పోలవరం ఆయకట్టుకు నీళ్లందిస్తాం.
శాసనసభ దేవాలయం అనలేదా?
చంద్రబాబు దుర్మార్గాల ఫలితంగానే పోలవరం డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. దీనిపై అర్థవంతమైన చర్చకు మేం సిద్ధం. శాసనసభకు రండి చర్చిద్దాం. చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమీ అనకపోయినా అన్నట్లుగా ఊహించుకుని శాసనసభ నుంచి నిష్క్రమించారు. నాడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే దేవాలయం లాంటి శాసనసభకు ఎందుకు హాజరు కారని చంద్రబాబు ప్రశ్నించలేదా? మరిప్పుడు చంద్రబాబు ఎందుకు రావడం లేదు? పోనీ ఆయన ఇంటి దగ్గరైనా చర్చకు మేం సిద్ధమే.
Comments
Please login to add a commentAdd a comment