సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టే పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకువచ్చారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌లా కాకుండా... ‘చంద్రబాబు, నిమ్మగడ్డ జాయింట్ కమిషన్’లా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా తయారైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అన్నీ కుట్రపూరితంగానే..
‘ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పక్షాలను ఈ రోజు సమావేశానికి పిలిచిన రమేష్‌కుమార్.. కరోనా పేరు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసిన రోజు ఎందుకు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయలేదు? కుట్ర దాగి ఉండబట్టే ఎవర్నీ సంప్రదించలేదన్నది ఆయన చర్యల ద్వారా రూఢీ అవుతోంది. నాడు ఎన్నికలు వాయిదా వేసినప్పుడు రాష్ట్రంలో 3, 4 కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రోజుకు 3 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరగాల్సిన ఎన్నికలను నాడు టీడీపీ జరపలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కమిషనర్‌కు సహకరించాం. అయితే రమేష్‌కుమార్ కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కోవిడ్ పేరు చెప్పి అర్థాంతరంగా ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు.. రెండు రోజులుగా సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో మాట్లాడుతున్నానని చెబుతున్న కమిషనర్ నిమ్మగడ్డ, అన్ని రాజకీయ పక్షాలను పిలవాలని నిర్ణయించక ముందే ఎందుకు వీరిని సంప్రదించలేదు? అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లే కదా?
రహస్య మంతనాలు కుట్ర రాజకీయం కాదా?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకుల్నే ఒకచోట కూర్చోబెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఎన్నికలు పెట్టాలంటే ఎలా కుదురుతుంది..? రాజకీయ పార్టీలతో వన్ టూ వన్ సమావేశాలు పెట్టింది ఒకరు మాట్లాడింది మరొకరికి తెలియకూడదనా? రహస్యంగా ఎందుకు మాట్లాడాలి? ఇలాంటి రహస్య మంతనాలు చేసే ధోరణి కుట్ర రాజకీయం కాక మరేమిటి..? హైదరాబాద్‌లో చీకట్లో స్టార్ హోటళ్లలో టీడీపీతో కుమ్మక్కై నిమ్మగడ్డ సాగించిన రహస్య మంతనాలను రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. అలాంటి పెద్ద మనిషి చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తారంటే నమ్మాలా? వ్యవస్థల్లో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేశారు, రమేష్ గారిలో కూడా చంద్రబాబు పరకాయ ప్రవేశం చేశారు.
ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ భయపడదు
వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు ఎప్పుడూ భయపడదు. ఎన్నికలు జరగాలనే మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు జరిగినా బంపర్ మెజారిటీతో గెలుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 18 నెలల పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాల వల్ల మేం గెలవడం ఖాయం. ఆ విషయం ప్రజలకు, ప్రతిపక్షాలకూ తెలుసు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిలో ఒక దశ పోయి, రెండో దశ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్,, భౌతిక దూరం తప్పనిసరి అని చెబుతున్నారు. అందువల్ల కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఎన్నికలు పెట్టే ఆలోచన చేయాలి. అలా కాకుండా ఎన్నికల కమిషనర్ కుట్ర పూరితంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోంది.
మీ సంబంధ బాంధవ్యాలు ప్రజలకు తెలుసు
నిమ్మగడ్డ ప్రతిచోటా చంద్రబాబు కుట్రలో భాగంగానే వ్యవహరిస్తున్నారు. కేంద్రానికి రాసిన లేఖ మొదట తాను రాయలేదని, మళ్ళీ తానే రాశానని చెప్పారు. టీడీపీ ఆఫీసుకు, కమిషనర్ ఆఫీసుకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఆ లేఖ ఎందుకు లీకు అయింది..? నిమ్మగడ్డ తరఫున వాదించిన ఖరీదైన న్యాయవాదుల కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేశారు? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరించకుండా చట్టబద్ధంగా ఉండాలి. రాజకీయ కుట్రలో ఎన్నికల కమిషనర్ భాగస్వామి కావొద్దు. ప్రజాస్వామ్యంలో మీ కుట్రలు ఎంతో కాలం నిలబడవు..’ అని అంబటి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment