Ambati Rambabu Says Chandrababu Statements are Lies - Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి

Published Thu, Jul 27 2023 6:59 PM | Last Updated on Fri, Jul 28 2023 4:35 AM

Ambati Rambabu Says Chandrababu Statements are Lies  - Sakshi

సాక్షి, అమరావతి :శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే కృష్ణా జలాలను తరలించేలా 2015లో అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టి, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాయలసీమ రైతుల హక్కుల ప్రయోజనాలను తెలంగాణ సర్కారు కాలరాస్తుంటే నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరెత్తలేదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబేనని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సర్కార్‌కు రాయలసీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై మంగళ, బుధవారాల్లో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలేనని తిప్పికొట్టారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువలోకి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా చెంబుడు గోదావరి జలాలను ఎత్తిపోసి.. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను పది రోజులు కూడా నడిపించలేదని.. అదో వృథా ఎత్తిపోతల అని చెప్పారు.

అలాంటి దానికి చంద్రబాబు రూ.2,047 కోట్లు ఖర్చు చేశారన్నారు. దాన్ని గడువులోగా పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్‌కు బహుమానంగా రూ.257 కోట్లను ఇచ్చినట్లు చూపి గుటకాయ స్వాహా చేశారని ఎత్తిచూపారు. గోదావరి కుడిగట్టుపై పర్యావరణ అనుమతి తీసుకోకుండా రూ.1,697 కోట్లు వ్యయం చేసి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతలను నిర్మించిన చంద్రబాబు.. దాని ద్వారా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేదని గుర్తు చేశారు. ఆ ఎత్తిపోతలపై కూడా టీడీపీ నేతలు ఎన్జీటీలో కేసులు వేయడంతో పనికి రాకుండా పోయిందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పేరుతో రూ.3,744 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన చంద్రబాబు ప్రజాద్రోహి అని ధ్వజమెత్తారు. మీడియాతో మంత్రి అంబటి ఇంకా ఏం చెప్పారంటే..

రూ.68 వేల కోట్లు తినేశానని చెప్పుకో 
టచంద్రబాబు, కరవు కవల పిల్లలు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏటా సగటున 300 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా మారింది. 
  రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు 54. కానీ.. 198 ప్రాజెక్టులను ప్రీక్లోజర్‌ చేసినట్లు చంద్రబాబు చెబుతున్నాడు. 198 ప్రాజెక్టులు కాదు.. ప్యాకేజీలు. ప్రాజెక్టులకూ ప్యాకేజీలకు తేడా తెలియదా బాబూ? దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో సులభంగా ఉండే పనులు చేసి, క్లిష్టమైన పనులు చేయకుండా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దాంతో వాటిని ప్రీక్లోజ్‌ చేసి, ప్రభుత్వ అనుమతితో వాటికి మళ్లీ టెండర్లు పిలిచి.. పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, వాటిని ఆపేశారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.

  ప్రాజెక్టులపై 2014–19 మధ్య రూ.68,293.94 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ సర్కార్‌.. కేవలం 3.4 లక్షల ఎకరాల పాత, కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగింది. 2019 మే 30 నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.27,394 కోట్లు వ్యయం చేసి, 5.03 లక్షల ఎకరాలకు నీళ్లందించాం. దీన్ని బట్టి ప్రాజెక్టు పనుల పేరుతో చంద్రబాబు వేలాది కోట్ల రూపాయలను దోచేసినట్లు స్పష్టమవుతోంది.

  పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన రూ.10,860 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. నీరు–చెట్టు పేరుతో రూ.12,400 కోట్లను టీడీపీ నేతలకు చంద్రబాబు దోచిపెట్టారు. ప్రాజెక్టులపై రూ.68,293 కోట్లను వ్యయం చేశామని కాకుండా తిన్నామని చంద్రబాబు చెప్పుకుంటే సరిపోతుంది.
ప్రాజెక్టులకూ వెన్నుపోటు

 ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చెబుతున్నట్లు ఎన్టీఆర్‌ డిజైన్‌ చేసిన తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను 1995 నుంచి 2004 వరకు చేపట్టకుండా రాయలసీమ ప్రజలకూ వెన్నుపోటు పొడిచారు. 

  ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా చేపట్టాలని రాయలసీమలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలని.. ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలని ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా కోరావా చంద్రబాబూ? 

   2004లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సముద్రం పాలవుతోన్న నదీ జలాలను మళ్లించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞం కింద ప్రాజెక్టులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీలను సింహభాగం పూర్తి చేశారు.

   పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడం ద్వారా రాయలసీమకు మహానేత వైఎస్‌ న్యాయం చేస్తుంటే.. దాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్‌లో నాగంతో విజయవాడలో దేవినేని ఉమాతో ధర్నాలు చేయించిన చంద్రబా­బు­ను రాయలసీమ ద్రోహి అనక ఇంకేమనాలి?
నాలుగేళ్లుగా సువర్ణ అధ్యాయం 

  మహానేత వైఎస్సార్‌ జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తూ జాతికి అంకితం చేస్తున్నారు. పెన్నా బ్యారేజ్, సంగం బ్యారేజ్‌లను జాతికి అంకితం చేయడం ద్వారా చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ లిఖించారు. ఆ బ్యారేజ్‌లను పూర్తి చేశానని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదా చంద్రబాబూ?

 గండికోట నిర్వాసితులకు సీఎం వైఎస్‌ జగన్‌ పునరావాసం కల్పించడంతో పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నాం. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు నిల్వ చేస్తున్నాం. సోమశిల, కండలేరులలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశాం. తెలుగుగంగ కెనాల్‌ను ఆధునికీకరించడం ద్వారా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి.. వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. ఆయకట్టుకు నీళ్లందిస్తున్నాం. బ్రహ్మంసాగర్‌ మట్టికట్ట, లీకేజీలకు అడ్డు్డకట్ట కూడా వేయలేక చంద్రబాబు  చేతులెత్తేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి ఆ ప్రాజెక్టులో 17.85 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు.

  గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు 20 వేల క్యూసెక్కులను ఆ కాలువ ద్వారా తరలిస్తాం. వెలిగొండ, వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.

 అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30–40 రోజుల్లోనే దాన్ని ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా రూ.40,880 కోట్లతో రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద కాలువల సామర్థ్యం పెంచడం, రిజర్వాయర్ల నిర్మాణాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు.

  శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నప్పుడు కూడా కేటాయింపుల మేరకు రాయలసీమకు జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా సీఎం వైఎస్‌ జగన్‌ రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టి ఆ ప్రాంతానికి న్యాయం చేస్తున్నారు. దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించి ఆ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించడం ద్వారా వాటిని అడ్డుకుని రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు.

బాబూ.. ఈ ప్రశ్నలకు బదులివ్వు
ప్రాజెక్టు ప్రొటోకాల్స్‌ను తుంగలో తొక్కి.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులే చేపట్టి, కమీషన్లు కాజేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అస్తవ్యస్తంగా మార్చి.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం పోలవరమే. శుక్రవారం పోలవరంపై మాట్లాడతానని చెప్పిన చంద్రబాబుకు సిగ్గు, లజ్జా, చీము, నెత్తురు ఉంటే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాకే పోలవరంపై మాట్లాడు.

1.విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎందుకు తీసుకున్నావు?
2.కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించకుండా డయాఫ్రమ్‌ వాల్‌ను ఎందుకు నిర్మించావు?
3.పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేస్తానని శాసనసభలో శపథం చేసి.. ఎందుకు పూర్తి చేయలేకపోయావు?

ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలవా? 
దాదాపు 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లలేని చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతే లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు.. నువ్వే డిజైన్‌ చేసి, టెండర్లు పిలిచి, పూర్తి చేసి, జాతికి అంకితం చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? మహానేత వైఎస్సార్‌ ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులు చేపట్టి 2009 నాటికే 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తూ.. జాతికి అంకితం చేస్తూ.. రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తుండటం కన్పించడం లేదా చంద్రబాబూ?

ఇదీ చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement