సాక్షి, అమరావతి : ఎస్‌ఈసీని ఓ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేలా నిమ్మగడ్డ రమేష్ బాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ' రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఎన్నికలపై అభిప్రాయాలు తీసుకుంది. ఈ సమావేశానికి మేం వెళ్లడం లేదని, బహిష్కరిస్తున్నామని నిన్ననే స్పష్టంగా చెప్పాం. ఈసీ విడుదల చేసిన నోట్‌లో మేము చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టారు. ఇదే ప్రక్రియను ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో ఎందుకు పాటించలేదు. ఎన్నికలు వాయిదా వేయాలా..కొనసాగించాలా అని రాజకీయ పక్షాలను ఎందుకు అడగలేదు. ఎన్నికలు వాయిదా వెనుక కుట్ర దాగుంది అనటానికి ఇదే ఉదాహరణ. (చదవండి : రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం)
ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయ పక్షాలతో మాట్లాడాలనే నిర్ణయానికి ముందే ఎందుకు ప్రభుత్వంతో చర్చించలేదు. చంద్రబాబు నిమ్మగడ్డల కమిషన్‌గా ఎస్‌ఈసీని మారుస్తున్నారు. ఆ రోజు కేవలం మూడు, నాలుగు కరోనా కేసులు ఉంటే ఇవాళ 3వేల కేసులు ఉన్నాయి. ఎన్నికలు జరగాలని, ఆ ప్రక్రియను ప్రారంభిస్తే మీరు అర్థాంతరంగా వాయిదా వేశారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు.. చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా మిగిలారు. మీరు కేంద్రానికి రాసిన లేఖలో ఎన్ని మాటలు అన్నారు. ఆ లేఖలో ప్రభుత్వ ఆర్డినెన్స్ గురించి రాశారు. డబ్బు, మద్యం పంపిణీపై చట్టం చేస్తే మీకేమి సంబంధం?(చదవండి : నిమ్మగడ్డ సమావేశానికి వైఎస్సార్‌సీపీ వెళ్లదు)
ఎన్నికల్లో మద్యం, ధనం ప్రభావం లేకుండా చూసేందుకు..తెచ్చిన చట్టంపైనా నిమ్మగడ్డ రమేష్ విమర్శలు చేశారు. చంద్రబాబు రాసిన లేఖలో నిమ్మగడ్డ సంతకం చేశారు.రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం ఎందుకు జరపలేదు. వ్యక్తిగతంగా వన్ టు వన్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు?. ఓ హోటల్‌లో రహస్య సమావేశాలు నిర్వహించిన వ్యక్తి నిమ్మగడ్డ. టీడీపీతో కుమ్మక్కై ఎస్ఈసీ పనిచేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్సే. కరోనా రెండో దశ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలున్నాయి. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని...టీడీపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదం' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment