వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూల్చబోమని నిన్న హైకోర్టులో చెప్పారు
ఈవాళ నేల మట్టం చేశారు ∙ఇది కోర్టు ధిక్కరణే.. కోర్టులోనే తేల్చుకుంటాం
కక్ష సాధింపు చర్యలను ఏ రాజకీయ పార్టీలూ క్షమించకూడదు
మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లిలో కూల్చిన పార్టీ ఆఫీస్ ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం చంద్రబాబు కూటమి దుష్ట పాలనకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని సీతానగరంలో బాబు ప్రభుత్వం కూల్చివేసిన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రాంతాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు తదితరులతో కలిసి పరిశీలించారు.
అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన విధానం కాదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిందేనని, అప్పట్లోనే టీడీపీకి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గుర్తు చేసారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఈ భవనాన్ని కూల్చబోమని నిన్న కోర్టులో చెప్పి, ఇవాళ ఉదయాన్నే కూల్చి వేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అన్నారు. నియమ నిబంధనల ప్రకారం భవనం నిర్మాణం చేపట్టిన విషయాన్ని న్యాయస్థానానికి తాము వివరించామన్నారు.
అయితే శని, ఆదివారాల్లో అప్పీలు చేసుకునే అవకాశం లేదనే తెల్లవారుజామునే పార్టీ కార్యాలయం కూల్చివేత చేపట్టారన్నారు. ఈ దుర్మార్గ చర్యను దేశంలోని ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. అధికారంలో ఉన్నాం కదా అని కూల్చివేయడం సరికాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. చట్టబద్ధ పాలన చేస్తామని, కక్ష సాధింపులు ఉండవని చెప్పిన సీఎం చంద్రబాబు.. అధికారాన్ని చేపట్టిన రోజుల వ్యవధిలోనే విధ్వంస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి దుర్మార్గ పాలనను రాజకీయ పక్షాలు క్షమించకూడదన్నారు. ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చివేయాలంటే చట్టపరంగా రావాలని, న్యాయ స్థానాల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకాలపాలపై కోర్టులో పోరాడుతామని, ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు. కేబినెట్ ఆమోదించాకే ఇక్కడ స్థలాన్ని తీసుకొని, పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారన్నారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపేనని, ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment