India Today Conclave 2024
అందుకే తిరిగి మా వద్దకు వచ్చారు
ఎన్డీయేలో కలుస్తానని అడిగారు.. దీంతో కలుపుకున్నాం
ఇండియా టుడే కాంక్లేవ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బుద్ధి రావడం వల్లే మళ్లీ బీజేపీ దగ్గరకు వచ్చారని తెలిపారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో.. ‘ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్ అన్నారు.. అలాంటి వ్యక్తితో మీరెలా పొత్తు పెట్టుకున్నారు’ అని అమిత్‌షాను యాంకర్ ప్రశ్నించారు.
దానికి అమిత్‌షా జవాబిస్తూ.. ‘ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. మేం ఆయనను వెళ్లమనలేదు.. ఆయనే వెళ్లిపోయారు.. ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బాబుకు బుద్ధొచ్చింది. మళ్లీ మా వద్దకు వచ్చారు. తిరిగి ఎన్డీయేలో కలుస్తానన్నారు. దీంతో ఆయనను కలుపుకున్నాం’ అంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఇన్ని రోజులుగా బీజేపీయే తమను పిలిచిందని, ఎన్డీయేలో చేరాలని ఆహ్వానం పంపిందంటూ టీడీపీ నేతలు చెప్పిన మాటలు, బీజేపీకి చంద్రబాబు పలు షరతులు పెట్టారని పచ్చ మీడియా చేసిన ప్రచారం అంతా బూటకమని తేలిపోయింది. ఓటమి భయంతోనే చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని ఎన్డీయేలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డారని స్పష్టమైంది.
కొన్ని బిల్లులకే వైఎస్సార్‌సీపీ మద్దతు
అమిత్ షాకు యాంకర్ మరో ప్రశ్న వేస్తూ.. ‘పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ కొన్ని బిల్లులకు మద్దతిచ్చింది కదా..మరి అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో ఎందుకు పెట్టుకున్నారు’ అని అడిగారు.
దీనికి అమిత్ షా సమాధానం చెబుతూ..‘బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వలేదు. కొన్నింటికి మాత్రమే మద్దతు ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండటం వల్లే తప్ప బీజేపీ కోసం కాదు. పార్లమెంట్‌లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవు. ఆయా పార్టీలకు సొంత అజెండాలు, సిద్ధాంతాలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే అంశాన్ని బట్టి అవి నడుచుకుంటాయి’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment