మేమొస్తే బీసీ సీఎం: అమిత్‌ షా | Amit Shah Comments On CM KCR And Ktr | Sakshi
Sakshi News home page

మేమొస్తే బీసీ సీఎం: అమిత్‌ షా

Published Sat, Oct 28 2023 1:17 AM | Last Updated on Sat, Oct 28 2023 3:59 AM

Amit Shah Comments On CM KCR And Ktr - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సూర్యాపేట: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించి, బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు. ఒకవేళ ఈసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఈసారైనా దళితుడిని సీఎం చేస్తావా చెప్పాలని కేసీఆర్‌కు సవాల్‌ చేశారు.

కేసీఆర్‌కు తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయడం లక్ష్యమైతే.. కాంగ్రెస్‌ లక్ష్యం రాహుల్‌ గాందీని ప్రధానిని చేయడమని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ బీసీ, దళిత వ్యతిరేక పార్టీలేనని విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనగర్జన సభలో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీలు కూడా కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశంలో, రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోంది.

సీఎం కేసీఆర్‌ దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి హామీ ఎక్కడికి పోయింది? దళితుల ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.50వేల కోట్లతో పెడతానన్న ప్రత్యేక బడ్జెట్‌ హామీ ఏమైంది? బీసీల సంక్షేమం కోసం రూ.10వేల కోట్లతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని చెప్పిన కేసీఆర్‌ ఏం చేశారు?  
రాష్ట్రానికి అండగా కేంద్ర సర్కారు 
ప్రధాని మోదీ దేశంలో మొదటిసారిగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయడమే గాక అన్ని అధికారాలూ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి సమ్మక్క, సారక్క యూనివర్సిటీగా పేరు పెట్టింది. పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్ల నుంచి పసుపు రైతులు ఉద్యమాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదు. రైతుల కష్టాలను గుర్తించిన బీజేపీ పసుపుబోర్డు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజలు కృష్ణా జలాల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే.. వారి హక్కులను సమకూర్చేందుకు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి అండగా నిలిచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. 
 

లక్షల కోట్లు కేటాయించాం.. 
తెలంగాణలో 40లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అందజేస్తున్నాం. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద గ్రామీణ ప్రాంతాల తాగునీటికి నిధులను విడుదల చేస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. గత నాలుగేళ్లుగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రాష్ట్రంలోని 1.90 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలను కేటాయించాం. తెలంగాణ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. అందుకోసం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను గద్దె దింపి, బీజేపీ అభ్యర్థులను గెలిపించి అధికారంలో తీసుకురావాలి. 
 

రామ మందిరం సాకారమవుతోంది 
550 ఏళ్ల పోరాటం, ఆరాటం తర్వాత బీజేపీ సారథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. ప్రధాని మోదీ సారథ్యంలో ఈ కల సాకారం కాబోతోంది. జనవరి 22న ప్రధాని మోదీ రాముడు జన్మించిన అయోధ్య రామ మందిరంలో తొలిపూజ చేయనున్నారు. ఈ బృహత్తర కార్యానికి సూర్యాపేట జిల్లా ప్రజలంతా రావాలి..’’ అని అమిత్‌షా పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా పరిధిలో బీజేపీ తరఫున సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర్‌రావు, తుంగతుర్తిలో కడియం రామచంద్రయ్య, భువనగిరిలో గూడూరు నారాయణరెడ్డి, నాగార్జునసాగర్‌లో నివేదితారెడ్డిలను గెలిపించాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. 

బీఆర్‌ఎస్‌ అవినీతిని నిర్మూలిస్తాం: కిషన్‌రెడ్డి 
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక పోరాటం కోసం ప్రజలంతా బీజేపీకి మద్దతివ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత సూర్యాపేట ప్రజలకు ఉందని, అవినీతి బీఆర్‌ఎస్‌పై పోరాటంలోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగిన రోడ్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 2,500 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆరులేన్లుగా మార్చడంతోపాటు ఇండ్రస్టియల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉచిత వైద్యం, విద్య, పంటల బీమా పథకం వంటివి అమలు చేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి సమూలంగా నిర్మూలిస్తామన్నారు. 
  
  
============== 
27ఎస్‌పిటి175, 178, 179 : సూర్యాపేటలో నిర్వహించిన జనగర్జన సభలో మాట్లాడుతున్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 
27ఎస్‌పిటి181 : సూర్యాపేటలో నిర్వహించిన జనగర్జన సభలో బీజేపీ అభ్యర్థులతో కలిసి అభివాదం చేస్తున్న అమిత్‌షా 
27ఎస్‌పిటి188, 190, 191 : సూర్యాపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగర్జన సభకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు 
–––––––––––––––––––––––––––––––– 
ఫొటోలు 1.40 రేపటి డేట్‌ ఫోల్డర్‌లో వేశాం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement