సాక్షి, హైదరాబాద్: సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల విచారణలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి అరెస్టులు వంటివి అనివార్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని.. అప్పుడు బీజేపీకి ప్రతికూలంగా జరిగే ప్రచారాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ, బయటపడుతున్న వాస్తవాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్టు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించడం, ఢిల్లీలో, హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నిరసనలు, కేంద్రాన్ని, ప్రధాని మోదీని తప్పుబడుతూ జరుగుతున్న ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది. ఈ నెల 16న కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నందున.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నేతలపై అవినీతి, అక్రమ ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేసి, బీజేపీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని సూచించినట్టు సమాచారం.
విమానంలో సమస్యతో..
ఆదివారం హైదరాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్‌డే కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన 11.40 గంటలకు బీఎస్‌ఎఫ్ ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చికి వెళ్లాలి. కానీ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో దాదాపు నాలుగున్నర గంటల పాటు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోనే ఉండిపోయారు.
ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా అక్కడే ఆగారు. ఈ సందర్భంగా వారు పలు విడతలుగా రాష్ట్ర అంశాలపై అమిత్‌షాతో చర్చలు జరిపినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ సర్కారు, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు, ఢిల్లీ లిక్కర్ స్కాంపై అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
దర్యాప్తులపై స్పష్టత ఇవ్వండి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదన్న విషయాన్ని.. ఈ కేసులో వాస్తవాలు, ఆధారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు అమిత్‌షా సూచించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో బీజేపీకి, ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదని వివరించాలని ఆదేశించినట్టు సమాచారం. నేతలంతా సమష్టిగా ముందుకు సాగాలని, మెరుగైన సమన్వయం అవసరమని నొక్కి చెప్పారని తెలిసింది.
కొన్నిరోజుల కింద ఢిల్లీలో అమిత్‌షాతో జరిగిన రాష్ట్ర కోర్‌కమిటీ భేటీ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై బండి సంజయ్ ఓ నివేదికను అందజేసినట్టు సమాచారం. బీఎస్‌ఎఫ్ విమానానికి మరమ్మతులు పూర్తయ్యాక అమిత్‌షా ఢిల్లీకి బయలుదేరారు. ఇక సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు పునః ప్రారంభం అవుతుండటంతో కిషన్‌రెడ్డి, సంజయ్, లక్ష్మణ్ కూడా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment