ఏపీలోనే కాదు.. మన దేశంలోనూ ప్రజలు నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. అధికారిక గుర్తింపుకార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, రుణం పొందాలన్నా, అంతెందుకు ప్రయాణాలు చేయాలన్నా ఈ కార్డ్ ఉండాల్సిందే. అయితే రాష్ట్రంలో మాత్రం ఎగస్ట్రా కార్యకలాపాలకూ ఆధార్ తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రూల్స్ పెడుతోంది.
👉కర్నూలు పుచ్చకాయలమాడ గ్రామంలో ఇవాళ సీఎం చంద్రబాబు ఫించన్ల పంపిణీలో పాల్గొన్నారు. అయితే.. పోలీసుల వలయంగా మారిన ఆ ఊర్లోకి.. స్థానిక ప్రజల్నే పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం. పైగా ఊరిలోపలికి వెళ్లడానికి ఆధార్ కార్డు కచ్చితంగా చూపించాలని షరతు పెట్టారు. దీంతో.. తమ ఊరికి వెళ్లడానికి తమకు ఇన్ని ఆంక్షలేంటో అనుకున్నారు.
👉విజయవాడలో మొన్న బుడమేరు వరద బాధితులకూ ఆధార్ కష్టాలు తప్పలేదు. ప్రభుత్వం తరఫున 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశించిన చంద్రబాబు.. అందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖకు సూచించారు. అయితే వరదలతో కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన బాధితులు.. ఆ ఆధార్ నిబంధనతో సరుకుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది.
👉మరోవైపు.. సంక్షేమ పథకాల విషయంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏనాడూ రూల్స్ కొర్రీ పెట్టలేదు. వలంటీర్ల లాంటి క్షేత్రస్థాయి సిబ్బందితో అర్హులను గుర్తించడం ద్వారా ఆ పని తేలికైంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ‘ఆధార్’ తప్పనిసరి అనే నిబంధనను జొప్పిస్తోంది. తల్లికి వందనం లాంటి ఆచరణకు నోచుకోని పథకానికి సైతం ఆ మధ్య ఆధార్ తప్పనిసరి అనే ప్రకటన చేసింది. మొన్నీమధ్య బడులలో విద్యా కానుక కిట్లను సంఖ్యను బట్టి ఇచ్చినప్పటికీ.. ఇకపై మాత్రం కచ్చితంగా ఆధార్ ఉంటేనే అని చెప్పేసింది. ఆధార్ కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని తేల్చేసింది . ఇది లబ్ధిదారులను ఇబ్బందులకూ గురి చేయడం కాకపోతే మరేమిటి?.
👉చివరగా .. తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. తిరుమలకు వచ్చేవారు ఒకప్పుడు 10–20 లడ్డూలను తీసుకెళ్లేవారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో.. ఇంటి చుట్టుపక్కల వారికి పంచి పెట్టేవాళ్లు. అలాంటిది ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం రెండు మాత్రమే విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. పైగా.. ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. ఇది బాబుగారి హయాంలోనే జరగడం కాకతాళీయమేనంటారా?. మునుముందు ఆధార్‌ను ఇంకా దేనికి దేనికి వర్తింపజేస్తారో?!.
కొసమెరుపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గతంలో వలంటీర్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో.. వలంటీర్లు ఏపీ ప్రజల ఆధార్ కార్డ్ తదితర వివరాలు తీసుకుని చేయరాని , చేయకూడని పనులు చేశారంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు ఎంతలా విమర్శలకు తావిచ్చాయో తెలిసిందే. మరి ఇప్పుడు ఏపీలో ఆధార్ కంపల్సరీ రూల్ వెనుక మతలబు ఏంటన్నది పవన్ అయినా చెప్తారా?. వెయిట్ అండ్ సీ..
Comments
Please login to add a commentAdd a comment