
సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పాల్పడిన పాపాలే పోలవరం పనుల్లో జాప్యానికి కారణమని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. లేదంటే 2021 నాటికే ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్లమన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1941 నుంచి కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుకు 2004లో దివంగత సీఎం వైఎస్సార్ కార్యరూపం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో రూ.16 వేల కోట్ల అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని.. నిధులు ఇస్తామని కేంద్రం షరతు పెడితే దానికి 2016 సెప్టెంబర్ 30న చంద్రబాబు అంగీకరించడం దారుణమన్నారు.
నిర్వాసితులకు న్యాయం
‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు ఎవరైనా వస్తే పోలీసులతో గెంటేయించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ.6.50 లక్షల పరిహారం ఇస్తుంటే.. దానికి అదనంగా రూ.3.50 లక్షలు చేర్చి మొత్తం రూ.పది లక్షలు అందిస్తున్నారు. చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హతే లేదు.’
– బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం