2023 ఖరీఫ్‌కు పోలవరం | CM YS Jagan clarification On Polavaram in AP Assembly Sessions | Sakshi
Sakshi News home page

2023 ఖరీఫ్‌కు పోలవరం

Published Wed, Mar 23 2022 2:03 AM | Last Updated on Wed, Mar 23 2022 2:03 AM

CM YS Jagan clarification On Polavaram in AP Assembly Sessions - Sakshi

శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వేను కట్టాక.. ప్రధాన డ్యామ్‌ను నిర్మించడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించాలి. కానీ విజనరీ చంద్రబాబు మాత్రం కట్టీకట్టకుండా స్పిల్‌ వేను.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా రెండు కిలోమీటర్ల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి నది కుంచించుకుపోయింది. దీంతో ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో, దిగువ కాఫర్‌ డ్యామ్‌లోను కోతకు గురై గొయ్యిలు ఏర్పడ్డాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం వల్ల వరద ఎగదన్ని ముంపు గ్రామాలను చుట్టుముట్టింది. ఇది మనిషి సృష్టించిన విపత్తు (మ్యాన్‌ మేడ్‌ డిజాస్టర్‌). ఈ ఘనత విజనరీ చంద్రబాబుదే. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించి 2023 ఖరీఫ్‌కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) డిజైన్లను నెలాఖరులోగా ఆమోదిస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హామీ ఇచ్చారని, ఆ మేరకు డిజైన్లను ఆమోదించిన 18 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉక్కు సంకల్పంతో పని చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరంను సాకారం చేయడానికి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. ఆయన కొడుకుగా ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. శాసనసభ్యుల కోరిక మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆ మహానేతకు ప్రాజెక్టును అంకితం చేస్తామన్నారు. దేవుడి దయ.. ప్రజల ఆశీర్వాదంతో ఒక్క పోలవరం ప్రాజెక్టునే కాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేసి.. వాటి ఫలాలను రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామని చెప్పారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో బాబు ప్రభుత్వ హయాంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పనులను ఫొటోలు, వీడియోలు, ఆధారాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే... 
 
ఇంకొకరు చేస్తున్నారనే కడుపుమంట  
► పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు రోజుకో తప్పుడు ప్రచారం చేయడం.. ఆయనకు బాజా మోగించే ఎల్లో మీడియా దాన్ని ఎత్తుకుని కథనాలను వండి వార్చడం ఈ మధ్య కాలంలో సాధారణమైపోయింది. తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నారనే బాధ, ఆవేదన, అన్నింటికంటే ముఖ్యంగా కడుపు మంట.. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 బ్యానర్‌ కథనాల్లో మనకు కనిపిస్తున్నాయి.  
► 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేదు. తన సొంత జిల్లాలో నీటి సదుపాయం కల్పించడానికి ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు మన హయాంలో పూర్తవుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది.  
► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసాను కేంద్రమే భరిస్తుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. 2017 వరకు ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నాడు.   
► 2013–14 ధరల ప్రకారమే పోలవరాన్ని కడతానని ఒప్పుకుంటూ కేంద్రానికి సమ్మతి కూడా తెలిపాడు. ఈ విషయాలన్నింటిపై అప్పట్లో ఇదే సభలో నేను ఎంతగానో ప్రస్తావించాను. ఏం ప్యాకేజీ తీసుకుంటున్నావ్‌ చంద్రబాబూ.. మీకు జ్ఞానం ఉందా ? నువ్వేం అడుగుతున్నావు? వాళ్లేం ఇస్తున్నారు? (వీడియో ప్రదర్శించారు) అని అడిగితే.. మా గొంతు నొక్కేశారు.  
► దీనివల్ల కేంద్రం రూ.29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది. మేం మాత్రం పట్టు విడవకుండా 2017–18కి సంబంధించిన రేట్ల ప్రకారం రూ.55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. మేం అడిగిన ప్రతిసారీ చంద్రబాబు ఒప్పుకున్నాడు కదా అని వాళ్లంటారు. అసలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీదేనని చెబుతున్నాం. ఇలా వాళ్లకు, మాకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీనికి తోడు వరదలు, కోవిడ్‌. ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.    
 
ఇదీ విజనరీ మేధావితనం  

► ప్రపంచంలోనే తానొక పెద్ద మే«థోసంపన్నుడిగా తనకు తాను ఒక ముద్ర వేసుకుని, ఎల్లో మీడియా సహాయంతో దాన్ని ప్రచారం చేసుకునే పెద్దమనిషి చంద్రబాబు. ఈ విజనరీ చేసిన పనులు పోలవరానికి ఎంత శాపంగా మారాయన్నది (పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం ఫొటోను చూపిస్తూ) అందరికీ తెలియాలి. 
► ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం నదిని కుడివైపు మళ్లించాల్సి ఉంటుంది. నదిని మళ్లించడానికి స్పిల్‌ వేను ముందు పూర్తి చేయాలి. ఆ తర్వాత నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా, ఎగువ కాపర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంను కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాఫర్‌ డ్యాంల మధ్యలో ప్రధాన డ్యాం కట్టాలి.  
► ఈ పెద్దమనిషి ఏం చేశారంటే.. ఒకవైపు స్పిల్‌వే పని పూర్తి చేయకుండానే, మరోవైపున కాఫర్‌ డ్యాంలను కట్టడం ప్రారంభించాడు. తద్వారా వరద నీళ్లు దిగువకు పోవడానికి అవకాశమే లేదు. మధ్యలోకొచ్చేసరికి ముంపు గ్రామాలు మునిగిపోతాయని చంద్రబాబుకు జ్ఞానోదయమైంది. దాంతో పనులను మధ్యలో ఆపేశారు. 2 కిలోమీటర్ల పొడవున కట్టాల్సిన కాఫర్‌ డ్యాంలు కాస్తా అసంపూర్తిగా వదిలేశారు. స్పిల్‌వే పనులు కాలేదు.   
 
బాబు పాపాల వల్ల ప్రతిసారీ ఆటంకం  

► చంద్రబాబు చేసిన పని వల్ల వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారీ పనులుకు ఆటంకం కలుగుతోంది. ఒకవైపు వదిలిపెట్టిన కాఫర్‌ డ్యాం ఖాళీల ద్వారా వరద నీరు రెట్టించిన వేగంతో పోతుంది. మరోవైపు కట్టీకట్టని స్పిల్‌ వే ద్వారా వరద నీరు పోయే పరిస్థితి.  
► అలాంటి పరిస్థితుల్లో అటు స్పిల్‌వే దగ్గర, ఇటు కాఫర్‌ డ్యాం దగ్గర పనులు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వరద వచ్చిన ప్రతిసారీ ఈస్పిల్‌వే ముందున్న అప్రోచ్‌ ఛానెల్, స్పిల్‌ వే, కింద ఉన్న స్పిల్‌ ఛానెళ్లు నీళ్లతో నిండిపోయి ఉంటాయి. 
► వరద తగ్గిన తర్వాత కూడా స్పిల్‌ ఛానెల్‌లో దాదాపు 2 టీఎంసీలకు పైగా నీటిని మోటార్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి. మూడేళ్లుగా ప్రతి వర్షాకాలంలోనూ ఇవే కష్టాలు.   
 
దారుణమైన ప్లానింగ్‌ 
► చంద్రబాబు తాను పోతూపోతూ రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పెట్టాడో.. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాముల్లో అలాంటివే మూడు పెద్ద, పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 2,340 మీటర్ల వెడల్పుతో కట్టాలి. కానీ ఒకచోట 480 మీటర్లు, రెండో చోట 400 మీటర్ల గ్యాప్‌ మేర కట్టకుండా వదిలేశారు. 
► దిగువ కాఫర్‌ డ్యాంలో కూడా 480 మీటర్లు పొడవున కట్టకుండా వదిలేశారు. దీనివల్ల ఆర్థికంగా నష్టంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది.   
► కనిష్టంగా 10 లక్షల క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 25 లక్షల క్యూసెక్కుల వరకు గోదావరిలో వరదలు వచ్చాయి. స్పిల్‌వే పూర్తి కాలేదు కాబట్టి కాఫర్‌ డ్యాంల మధ్య ఉన్న ఖాళీల గుండా నీళ్లు పోవాల్సిన పరిస్థితి.  – 2.3 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవాహించాల్సిన గోదావరి ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో వదిలిన 480 మీటర్లు, 400 మీటర్ల మేర ఖాళీల ద్వారా కుంచించుకుపోయి ప్రవాహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25 లక్షల క్యూసెక్కుల వరద కాఫర్‌ డ్యాంల మధ్య నున్న ఖాళీల ద్వారా దిగువకు పోవాల్సిన పరిస్థితి. దీని వల్ల నీటి ప్రవాహ వేగం సెకనకు 2–3 మీటర్ల నుంచి 13.5 మీటర్లకు పెరిగింది.  
 
గుంతలు పూడ్చడానికి నిపుణులు మల్లగుల్లాలు 

► అధిక వేగంతో వరద ప్రవాహించడం వల్ల ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో బెడ్‌ లెవల్‌లో 23 మీటర్లు, పునాది కంటే దిగువన మరో 12 మీటర్లు.. 35 మీటర్ల లోతున కోతకు గురై.. పెద్ద గుంత ఏర్పడింది. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2 నిర్మాణ ప్రాంతంలో వరద వేగం ఉధృతికి బెడ్‌ లెవల్‌లో 8 మీటర్లు.. పునాది లోపల మరో 12 మీటర్లు మొత్తం 20 అడుగుల లోతున కోతకు గురై గుంత ఏర్పడింది.  
► దిగువ కాఫర్‌ డ్యాంలోనూ బెడ్‌ లెవల్లో 14 మీటర్లు, పునాదిలో మరో 22.5 మీటర్లు మొత్తం 36.5 మీటర్ల లోతున కోతకు గురై గుంత ఏర్పడింది. మెయిన్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ కూడా రెండు వైపులా దెబ్బతింది. ఇదీ చంద్రబాబు విజన్‌. దీన్ని సరిదిద్దడానికి దేశంలో ఉన్న సాంకేతిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ, ఇంజనీర్లు దగ్గర నుంచి ఐఐటీ నిపుణుల వరకు డిజైన్లును పరిశీలిస్తూ పరిష్కారం కోసం మల్లగుల్లాలు పడుతున్నారు.  
► పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన దారుణాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు కన్పించ లేదా? కనీసం వీటి గురించి ఎప్పుడైనా ప్రస్తావన చేశారా? ఇలాంటి ఈ పేపర్లు, టీవీ ఛానెళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాయా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement