సాక్షి,తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక మోసపూరితమైన బడ్జెట్ అని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం(నవంబర్ 13)తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మోసం చేయడం అనేది చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. ముగ్గురు కలసి నాటకం ఆడుతూ ప్రజలను నట్టేట ముంచారు.ఈ బడ్జెట్ లో గత బడ్జెట్ కంటే రూ.41వేల కోట్లు ఎక్కువ చూపించారు.కాగ్ నివేదిక ప్రకారం 9 శాతం వృద్ధి ఉన్నది ఇప్పుడు మైనస్ 2 శాతానికి పడిపోయింది.అలాంటప్పుడు ఏ విధంగా గత బడ్జెట్ కంటే ఎక్కువ చూపించారో అర్థం కావట్లేదు. ఇదంతా ఒక అంకెల గారడీ మాత్రమే అని తేటతెల్లం అవుతుంది.గత ప్రభుత్వం కంటే 20శాతం అప్పులు ఎక్కువగా పెంచారు.
దీనికి పచ్చమీడియా ప్రజలను మోసం చేస్తూ వార్తలు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కుటుంబంలో ఒక విద్యార్థికి ఇచ్చేలా 6500 కోట్లు పెడితే కుటుంబంలో అందరూ విద్యార్థులకు ఇస్తానని తల్లికి వందనం ఇచ్చేందుకు రూ.5387కోట్లు కేటాయించడం హాస్యాస్పదంగా ఉంది.ప్రజలకు మీ బడ్జెట్ అగమ్యగోచరంగా కనపడుతోంది.
ఈ బడ్జెట్ ద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టారు. సున్నావడ్డీ తీసేసారు.ధరల స్థిరీకరణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు.స్త్రీ శక్తి ద్వారా ఏడాదికి రూ. 18వేలు ఇస్తానని బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదు.గత ప్రభుత్వంలో 19,180కోట్లు,కాపు నేస్తం,వైఎస్సార్ ఆసరా,వైఎస్సార్ చేయూత పథకాల కింద మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశాం.ఉచితబస్సు ప్రయాణం ఇస్తానని బడ్జెట్‌లో ఇచ్చిందేంటి.
40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను తేనె పూసిన కత్తిలాగా మోసం చేస్తున్నారు.జాబ్ క్యాలెండర్ ఉందా? కాపు సంక్షేమం ద్వారా 15వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.కూటమి ప్రభుత్వంలో ఇప్పటిదాకా 3లక్షల 50వేల మందికి పెన్షన్లు తీసేశారు.సెంటు స్థలంలో సమాధికి కూడా సరిపోదని పట్టణంలో రెండు,రూరల్‌లో 3సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చి దానికోసం బడ్జెట్లో ఏమి కేటాయించని ఘనత చంద్రబాబుది.
ఉచిత ఇసుక పేరు చెప్పి కూటమి నేతలు దోచుకుంటున్నారు.పైకి మాత్రం ఇసుక జోలికి వెళ్లొద్దంటూ ఆదేశాలు చేస్తున్నట్లు నటిస్తున్నారు.వైసీపీ సోషల్ మీడియాపై చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది.అన్యాయం జరిగితే ఎదిరించేందుకు సిద్ధంగా ఉంటాం.ప్రతి కార్యకర్తకు ఎప్పుడూ అండగా ఉంటాం’అని కొట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment