ఏపీలో వామపక్షాలకు జ్ఞానోదయం కలిగిందా? చంద్రబాబు అండ్ పవన్‌కల్యాణ్‌ల ఊసరవెల్లి రాజకీయాలు వారికి నిజంగానే అర్థమయ్యాయా? బాబు, పవన్‌ల మీద ఏపీ లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి? వచ్చే ఎన్నికల్లో తమకు చంద్రబాబుతో కలిసే ఛాన్స్ పోతుందని ఆందోళన చెందుతున్నాయా? నిజంగా ఏపీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాయా?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ అక్కడి రాజకీయాలు ఎప్పటి నుంచో మాంచి కాకమీదున్నాయి. రేపే సీఎం సీటు మీద కూర్చోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉవ్విళ్ళూరిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వబోనని ప్రతిజ్ఞలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీతో బీజేపీని కలపాలని తెగ ఆరాటపడుతున్నారు.
కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు, బీజేపీ నుంచి బీఎస్‌పీ వరకు చంద్రబాబు పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ భారత దేశంలో లేదు. జనసేన పార్టీ స్థాపించి తొమ్మిదేళ్ళు గడచినా ఇంకా నిర్మాణమే చేయని పవన్ కల్యాణ్ కూడా బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, బీఎస్‌పీ..ఇలా అన్ని రకాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు దత్త పుత్రుడుగా ముద్ర వేయించుకున్నారు.
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే ఇతర పార్టీలు గౌరవించేవి. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు రాజకీయాలు మొదలుపెట్టాయో అప్పటినుంచే ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల గౌరవం తగ్గిపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సీపీఎం, సీపీఐలు ఈసారి టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని...ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాయి. కాని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తమకు ఎక్కడ దూరం అవుతాడో అని లెఫ్ట్ పార్టీలకు బెంగ పట్టుకుంది. అసెంబ్లీలో కాలు మోపే ఛాన్స్ ఈసారి కూడా మిస్ అవుతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. తాజాగా సీపీఎం, సీపీఐ తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు బీవీ రాఘవులు, కంకణాల నారాయణ సంయుక్తంగా చంద్రబాబు, పవన్‌లపై విరుచుకుపడ్డారు. మోడీ మెడ పట్టి గెంటుతున్నా..చూరు పట్టుకుని వేళ్ళాడటానికి ఇద్దరికీ సిగ్గు లేదా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.
ఒకసారి తెలుగుదేశంతో..మరోసారి కాంగ్రెస్‌తో... ఇలా ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నపుడే వామపక్షాలు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాయి. సొంతంగా పోటీ చేసినపుడు భంగపడ్డాయి. గత ఎన్నికల్లో పవన్‌తో కలిసి బోల్తా పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో జతకట్టాలని ఉబలాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. పవన్ చేస్తున్న బ్రోకరిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఏదో రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని పోజులు కొడుతున్నా.. వాస్తవానికి అసెంబ్లీలో ఒకటో.. రెండో సీట్లు గెలవాలంటే చంద్రబాబు పంచన చేరక తప్పదని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ టీడీపీ తోక పార్టీలుగా వ్యవహరిస్తూ.. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతలు ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రతిదానికీ విమర్శిస్తున్నాయి.
వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని పదే పదే చెబుతున్నారు. అందుకే సింహాన్ని ఎదిరించేందుకు గుంపుతో కలిసి రావాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ప్రజలకు దూరమైన కమ్యూనిస్టు పార్టీలు ఇలాగే చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న వాటి కోరిక ఎప్పటికీ నెరవేరదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment