‘ఒక్క కేసులో అయినా సీబీఐ విచారణకు సిద్ధమా?’ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి మంత్రి కాకాణి సవాల్‌

Published Wed, Feb 7 2024 2:16 PM

AP Minister Kakani Govardhan Reddy Fire On Yellow Media  - Sakshi

గుంటూరు, సాక్షి: చంద్రబాబుకి నీతిమంతుడని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. బాబుపై ఉన్న కేసుల్లో ఓ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. 24 గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాణి చంద్రబాబుకి సవాల్‌ విసిరారు. 

నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ తేల్చినా కూడా తనపై తప్పుడు రాతలు ఆగడం లేదని అన్నారాయన. 

‘‘గతంలో నాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఛార్జిషీట్ ని కూడా కొన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి. సీబీఐ విచారణకి ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టుకి చెప్పా. సీబీఐ విచారణ గత ఏడాదిగా విచారణ జరిపింది. ఛార్జి షీట్‌లో స్పష్టంగా నా ప్రమేయం లేదని తేలింది. పోలీసులపై సోమిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టమైంది. 

సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్.. అంతేగానీ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్‌ కాదు.  రెండేళ్లగా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రుజువైంది. దీనిపై చంద్రబాబు, లోకేష్ నేల టిక్కెట్ సమాధానం చెప్పాలి.. నేల టిక్కెట్ అంటే సోమిరెడ్డి. మీకు అనుకూలంగా వస్తే అత్యున్నత సంస్ధ అంటారు. అదే వ్యతిరేకంగా వస్తే సీబీఐ సరిగ్గా విచారించలేదని చెప్తారు. మీ వారికి బెయిల్ వస్తే న్యాయస్ధానాలు న్యాయం జరిగినట్లు.. లేకపోతే న్యాయస్ధానాలపై దాడులకి సిద్దపడతారు. 

చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి..ఎన్నో కేసులలో స్టే లు తెచ్చుకున్నారు. చంద్రబాబూ.. నీపై నమోదైన కేసులలో ఒక్క కేసులోనైనా నువ్వు సీబీఐ విచారణకి సిద్దమా?. మీ(చంద్రబాబు) పాత్ర లేకుంటే ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదు. నీపై వచ్చిన అభియోగాలపై ఎటువంటి విచారణకి సిద్దమా? లేదా? స్పష్టత ఇవ్వాలి. నువ్వు నీతిమంతుడివైతే సీబీఐ విచారణ జరిపించుకోవాలి. 24 గంటల లోపుల నా సవాల్ కి స్పందించాలి. నా సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతిపరుడని చంద్రబాబే ఒప్పుకున్నట్లే అని మంత్రి కాకాణి అన్నారు. 

చంద్రబాబు, టీడీపీ హయాం కంటే రైతులకు మేం ఎక్కువ మేలు చేశాం. టీడీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణపై సీబీఐ విచారణకి సిద్దమా?. చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే.. ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారు అంటూ మంత్రి కాకాణి చురకలు అంటించారు.

Advertisement
Advertisement