సాక్షి ప్రతినిధి కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన జట్టులో మరోసారి పాతవారికే అవకాశం కల్పించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డోన్, ఆలూరు ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, గుమ్మనూరు జయరాంకు మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో డోన్, ఆలూరులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. బైక్ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ సందడి చేశారు.
మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలోనే..
వైఎస్సార్‌సీపీ ఏర్పాటైన రోజు నుంచి బుగ్గన రాజేంద్రనాథరెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో డోన్ నుంచి బుగ్గన, ఆలూరు నుంచి గుమ్మనూరు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో అప్పటి టీడీపీ ప్రభుత్వ అక్రమాలు, అవకతవకల పాలన, విధానపర నిర్ణయాలపై బుగ్గన గట్టిగా తన వాణి వినిపించారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులుగా గెలుపొందారు.
ఎంపీలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీని కాదని టీడీపీలో చేరారు. రాష్ట్రంలో అత్యధికంగా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరింది అయితే కర్నూలు జిల్లా నుంచే! ఆ సందర్భంలో గుమ్మనూరు, బుగ్గన ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటూ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా నాగిరెడ్డికి అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అయితే నాగిరెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో పీఏసీ చైర్మన్‌గా బుగ్గన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.
తొలి మంత్రివర్గంలోనే చోటు
గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పూర్తిగా ఒక రాజకీయ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గంలో బుగ్గన, గుమ్మనూరుకు అవకాశం దక్కింది. మంచి వక్త, మృధుస్వభావి అయిన బుగ్గనతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లా చరిత్రలో బోయ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రివర్గంలో చోటు కల్పించడం అదే తొలిసారి.
జిల్లాలో బోయ వర్గానికి చెందిన రెండో ఎమ్మెల్యేగా గుమ్మనూరు గుర్తింపు పొందారు. అంతకు ముందు డోన్‌లో మేకల శేషన్న మాత్రమే బోయ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోని బీసీల్లో అధికశాతం బోయ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఆ సామాజిక వర్గం వారు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే జిల్లాకు చెందిన తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో బోయ సామాజికవర్గం వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తోంది.
మలి విడతలోనూ వారికే అవకాశం
2019 జూన్ 8న మంత్రులుగా బుగ్గన, గుమ్మనూరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థికశాఖ మంత్రిగా బుగ్గన, కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. 34 నెలలపాటు మంత్రులుగా కొనసాగిన ఇద్దరూ జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నెల 7న వారు రాజీనామాలు చేశారు. అయితే నూతన మంత్రివర్గంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వారిద్దరిపైనే నమ్మకం ఉంచారు. ఆర్థికశాఖ, అసెంబ్లీ కార్యకలపాల నిర్వహణ మంత్రిగా కొనసాగిన బుగ్గనకు కొత్త మంత్రివర్గంలో కూడా చోటు కల్పించారు. అలాగే బీసీలకు ప్రాధాన్యత కల్పించే విషయంలో మరోసారి జయరాంకు అవకాశం కల్పించారు.
మిన్నంటిన సంబరాలు
బుగ్గన, గుమ్మనూరుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో డోన్, ఆలూరు నియోజకవర్గాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డోన్‌లో ఎంపీపీ రాజశేఖరరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి నివాసం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి సొంత ఊరు బేతంచెర్లలో ఎంపీపీ బుగ్గన నాగభూషణ్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చలం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్యాపిలిలో పార్టీ నాయకులు బోరెడ్డి శ్రీరాములురెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆలూరులో మండల కనీ్వనర్ వీరేశ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment